స‌హ‌న‌శీలుర‌కు పాదాభివంద‌నం

ఏపీ టాప్ న్యూస్‌: పంతొమ్మిదవ శతాబ్దం తొలినాళ్లలోనే సమాన హక్కులకోసం అమెరికాలో నినదించిన మగువ తెగువ! రష్యాలో జారును బేజారెత్తించిన ధీశాలి సాహసం! ఐరోపా దేశాల్లో కదం తొక్కిన మహిళాఉద్యమం! ఏ సందర్భంలో పురుడుపోసుకున్నదైనా.. 1975లో మార్చి 8న స్థిరపడింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం! తాము సగభాగం ఉన్న సమాజంలో సమాన హక్కులకోసం.. సమాన అవకాశాల కోసం.. సమసమాజం కోసం.. ఒక లక్షిత పోరాటం! ఆకాంక్ష ఏండ్లనాటిదేనైనా.. మార్చి 8 ఒక మజిలీ! స్థాయీసామర్థ్యాలను అంచనావేసుకుని.. భావి భవిష్యత్తుకు బాటలు తీసే సం దర్భం! ఇప్పుడు మరోసారి! శతాబ్దాల సంకెళ్లను ఒక్కొక్కటిగా తెంచుకుంటూ ముందుకు సాగుతున్నా.. ఇంకా అనేక అమానుషాలు.. అవమానాలు! క్రీడలు మొదలుకుని.. ఆర్థిక వ్యవస్థ.. అంతరిక్షం.. అంతర్జాలాన్ని సైతం శాసించే స్థాయికి మహిళ ఎదుగుతున్నా.. ఇంకా అవే అన్యాయాలు! భారతదేశమూ మినహాయింపుకాదు! రోడ్లపై నిర్భయంగా తిరిగే పరిస్థితి ఇంకా ఎండమావే! భద్రమనుకునే ఇండ్లలోనూ అదే హింస! అయినా సహనానికి మారుపేరు.. తన బతుకు మారే రోజు కోసం ఓపికగా ఎదురు చూస్తున్నది! ఆటంకాలెన్ని ఎదురైనా.. తలవంచక.. పురుషాధిక్య సమాజానికి సవాలు విసురుతున్నది! అనేక విజయాలూ తన సిగలో పొదువుకుంటూనే ఉన్నది! నిన్నటికి నిన్న ఇస్రోలో రికార్డుస్థాయి ప్రయోగంలో కీలకపాత్ర పోషించిన మహిళా శాస్త్రవేత్తలే నిదర్శనం! ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచిన సింధూయే సాక్ష్యం! దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐకి సారథ్యం వహిస్తున్న అరుంధతీ భట్టాచార్య.. బహుళజాతి సంస్థ పెప్సీ కంపెనీకి సీఈవో ఇంద్రానూయీల చెదరని స్ఫూర్తి! ఆ స్ఫూర్తి కిరణాలకు.. ఆ సహనశీలురకు పాదాభివందనం!

Share