వైసీపీలోకి మాగుంట‌..తోట‌?

ఏపీ టాప్ న్యూస్‌: ఎన్నిక‌ల న‌గారా మోగింది. ఎన్నిక‌ల తేదీ కూడా వ‌చ్చేసింది. అయినా వ‌ల‌స‌లు ఆగ‌డం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే చాలా మంది టీడీపీ వ‌దిలి వైసీపీ తీర్థం పుచ్చుకోగా తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ తోట న‌ర‌సింహం, మాజీ ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల రెడ్డి ఇద్ద‌రూ కూడా ఈ రోజుకానీ..రేపు కానీ వైసీపీలో చేర‌నున్నారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. తెలుగుదేశం పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ తోట నరసింహం వైసీపీ అధినేత భేటీ అయ్యారు. నిన్న కాకినాడ వెళ్లిన సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్‌ను తోట క‌లిశారు. తోట నరసింహం భార్య తోట వాణి వైయ‌స్ఆర్‌సీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆమె కాకినాడ సిటీ లేదా పెద్దాపురం టిక్కెట్లలో ఒకటి ఇచ్చేందుకు జగన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. మరో టీడీపీ కీలక నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీ‌నివాసుల రెడ్డి ఈ రోజు వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే ఆయన మరోసారి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయాలని భావిస్తున్నారు.
అయితే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే ఒంగోలు ఎంపీగా గెలవడం సాధ్యం కాదని ఆయన భావించారు. తన సొంత సర్వేల్లో ఇదే విషయం వెల్లడి కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎదుటే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. చంద్రబాబుకూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఉన్నారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వైసీపీ బలంగా ఉండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఆయన వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. ఆయన పార్టీలో చేరితే ఒంగోలు వైసీపీ ఎంపీ టిక్కెట్ మాగుంటకు దక్కే ఛాన్సులున్నాయి.

Share