పీవీపీకి సీటు ఖాయ‌మేనా?

ఏపీ టాప్ న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధానిగా చెప్పుకునే విజయవాడ ఎంపీ సీటు గెలుచుకోవడాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటాయి. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ తరపున కేశినేని నాని విజయవాడ ఎంపీగా విజయం సాధించారు. ఈ సారి కూడా టీడీపీ ఎంపీగా ఆయనే మరోసారి బరిలో ఉండటం దాదాపు ఖాయమైంది. అయితే ఈ సారి విజయవాడ ఎంపీ స్థానాన్ని దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం వైసీపీ… టీడీపీ అభ్యర్థి కేశినేని నానిని అన్ని రకాలుగా ఢీ కొట్టే బలమైన నాయకుడిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా విజయవాడ వైసీపీ అభ్యర్థి రేసులో పారిశ్రామిక వేత్త పీవీపీ(పొట్లూరి వరప్రసాద్) పేరు తెరపైకి వచ్చింది. వైసీపీ అధినేత జగన్‌కు సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న పీవీపీ… గత ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్‌తో సన్నిహితంగా మెలిగారు.
ఆయన ద్వారా విజయవాడ టీడీపీ ఎంపీ సీటు దక్కించుకోవాలని పీవీపీ చివరివరకు ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటికే విజయవాడ ఎంపీ సీటుకు సంబంధించి చంద్రబాబు కేశినేని నానికి హామీ ఇవ్వడంతో… పీవీపీకి నిరాశ ఎదురైంది. వైసీపీ తరపున 2014లో విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని పీవీపీ భావించినా… ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అయితే మరోసారి పీవీపీ విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారని… వైసీపీ తరపున సీటు దక్కించుకునేందుకు రంగంలోకి దిగారని ఊహాగానాలు మొదలయ్యాయి.

Share