వైయ‌స్ వివేకానంద‌రెడ్డిది హ‌త్యే

ఏపీ టాప్ న్యూస్‌: మ‌హానేత వైయ‌స్ఆర్ సోద‌రుడు.. మాజీ మంత్రి వైయ‌స్ వివేకానంద‌రెడ్డి మృతి విషయంలో సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. ఆయనది సహజ మరణం కాదని వెల్లడైంది. కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నట్లు ఆయనది హత్యేనని తేలింది. ఫోరెన్సిక్ నివేదికలో ఈ విషయం తేలింది. వివేకానంద రెడ్డి ఒంటిపై ఏడు చోట్ల కత్తితో పొడిచిన గాయాలనున్నట్లు తేలింది. తలలో రెండు వైపులా కత్తితో పొడిచిన గాయాలు, ఛాతీ, చేతిపైనా కత్తి పోట్లు ఉన్నట్లు గుర్తించారు. నుదుటిపై రెండు చోట్ల లోతైన గాయాలున్నాయి. తొడ, చేతి వేళ్లపైనా గాయాలున్నట్లు తేలింది. దీంతో వివేకానంద రెడ్డిది ప్రాథమికంగా హత్యగానే నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. వైయ‌స్‌ వివేకానంద రెడ్డి హత్యకు గురైనట్టు ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఆయన భౌతికకాయానికి కొద్దిసేపటి కిందటే రిమ్స్‌ వైద్యులు పోస్టుమార్టం పూర్తిచేశారు. ఆ తర్వాత ఆయన భౌతికకాయాన్ని పులివెందులకు తరలించారు. ఆయన శరీరంపై ఏడు చోట్ల బలమైన గాయాలు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. వివేకాది హత్యగా తేలడం సంచలనంగా మారింది. ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? దీనిలో కుట్ర కోణాలేంటి అనే విషయాలు మిస్టరీగా మారాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారనేది తేల్చేందుకు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
పులివెందులలోని వివేకానంద రెడ్డి నివాసానికి చేరుకున్న వైఎస్‌ విజయమ్మ బోరున విలపించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వివేకా మృతి వార్తతో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అక్కడికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. వైసీపీ అధినేత జగన్‌ మరికొద్ది సేపట్లో పులివెందుల చేరుకోనున్నారు. మాజీ మంత్రి, వైయ‌స్‌ జగన్ చిన్నాన్న వివేకానంద రెడ్డి శుక్రవారం (మార్చి 15) ఉదయం పులివెందులలోని తన నివాసంలో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. ఆయన గుండె పోటుతో మరణించారని తొలుత భావించారు. అయితే.. వివేకా ఒంటిపై ఉన్న గాయాలను చూసి ఆయన కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తంచేశారు. వైయ‌స్‌ వివేకా హఠాన్మరణంపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
వివేకానంద రెడ్డి మృతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కడప ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ వెల్లడించారు. అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఈ సిట్‌‌ ఏర్పాటు చేశారు.
ఫోరెన్సిక్ నివేదికలో వివేకాది హత్యగా తేలడంతో పోలీసులు హత్య కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. పులివెందులలో వివేకా నివాసానికి వెళ్లిన ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ సుమారు 2 గంటల పాటు విచారణ జరిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివేకా నివాసంలో క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు. అసలేం జరిగింది? బెడ్‌ రూమ్‌లో ఏసీ ఉన్నప్పటికీ డోర్‌ ఎందుకు ఓపెన్‌ చేసి ఉంది? సైడ్‌ డోర్‌ లాక్‌ ఎవరు తీశారు? అనే కోణాల్లో విచారణ జరపుతూ వివరాలు సేకరిస్తున్నారు.

Share