వివేకా అంత్య‌క్రియ‌లు పూర్తి

ఏపీ టాప్ న్యూస్‌: దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సోద‌రుడు, మాజీ మంత్రి వైయ‌స్ వివేకానంద‌రెడ్డి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. వివేకా తండ్రి రాజారెడ్డి సమాధి(రాజాఘాట్) ప‌క్క‌నే ఆయన అంత్రక్రియలు నిర్వహించారు. ఉదయం వివేకా ఇంటి వద్ద ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఆయన భౌతికకాయాన్ని వాహనం ఎక్కించి అంతిమయాత్ర ప్రారంభించారు. వివేకాను కడసారి చూసేందుకు వైయ‌స్‌ అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావడంతో పులివెందుల జనసంద్రంగా మారింది. వైసీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భారీ భద్రత నడుమ తన చిన్నాన్న అంతిమయాత్రలో పాల్గొన్నారు. విషణ్ణ వదనంతో రెండు చేతులు జోడించి అందరికీ నమస్కరిస్తూ అంతిమయాత్రలో ముందుకు సాగారు. వైయ‌స్ అవినాష్‌రెడ్డి సహా కుటుంబ సభ్యులంతా అంతిమయాత్రలో పాల్గొన్నారు. వైయ‌స్‌ వివేకానందరెడ్డి పులివెందులలోని తన నివాసంలోనే దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే.
బాత్‌రూమ్‌లో విగతజీవిగా పడి ఉండటంతో గుండెపోటుతో మరణించి ఉండొచ్చని తొలుత భావించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో ఆయన హత్యకు గురయ్యారని, శరీరంలో ఏడుచోట్ల కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు చెప్పడంతో అందరూ షాకయ్యారు. సౌమ్యుడిగా పేరున్న వివేకానందరెడ్డిని హత్య చేయాల్సి అవసరం ఎవరికొచ్చిందన్న అనుమానాలు నెలకొన్నాయి. వివేకా హత్యపై రాష్ట్రప్రభుత్వం వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటుచేసింది. పోలీసులు డాగ్ స్వ్కాడ్స్‌, క్లూస్ టీమ్స్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. అయితే కేసును సీబీఐతో విచారణ చేయించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్, ఆదినారాయణరెడ్డి స్కెచ్‌తోనే వివేకా హత్యకు గురయ్యారని వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించడం సంచలనం రేపింది.

Share