టీఆర్ఎస్‌లో చేరిన నామా

ఏపీ టాప్ న్యూస్‌: ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ నేత నామా నాగేశ్వర రావు టీఆర్ఎస్‌లో చేరారు. కేటీఆర్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. నామా వర్గం చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ దాదాపు తుడిచి పెట్టుకుపోయినట్టే. అశ్వారాపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు మాత్రమే ఈ జిల్లా నుంచి టీడీపీలో ఉన్న నేత. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఓ వెలుగు వెలిగిన తుమ్మల నాగేశ్వర రావు కూడా గతంలోనే టీఆర్ఎస్‌లో చేరి మంత్రి పదవిని పొందిన సంగతి తెలిసిందే. ఇటీవలి ఎన్నికల్లో ఆయన పాలేరు నుంచి ఓడిపోయారు. ఇక నామా విషయానికి వస్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఖమ్మం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. కానీ టీఆర్ఎస్‌కు చెందిన పువ్వాడ అజయ్ చేతిలో ఓడారు.
మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నామా టీఆర్‌ఎస్‌లో చేరారు. దేశంలోని ధనిక రాజకీయ నాయకుల్లో నామా ఒకరు. గత ఎన్నికల సందర్భంగా ఈసీకి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.113 కోట్లు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి నామా నాగేశ్వర రావు అత్యంత సన్నిహితుడు. 2004లో టీడీపీ నుంచి ఖమ్మం లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన ఆయన రేణుక చౌదరి చేతిలో ఓడారు. 2009 ఎన్నికల్లో ఆమెపైనే విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. లోక్‌సభలో టీడీఎల్పీ నేతగా ఆయన వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్పీ అభ్యర్థి పొంగులేటి సుధాకర్ చేతిలో ఆయన ఓడారు. ఎంపీగా గెలిచాక పొంగులేటి టీఆర్ఎస్‌లో చేరారు.

Share