అవును.. బాబు ఏపీని నంబ‌ర్‌1గా నిలిపారు

ఏపీ టాప్ న్యూస్‌: “ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఏపీని నంబ‌ర్ వ‌న్‌గా నిలిపాడు“ అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. అయితే ఏపీని ఎందులో నంబ‌ర్‌గా నిలిపారో కూడా చెప్పారు. వివ‌రాల్లోకి వెళ్లితే. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప‌ర్య‌ట‌న చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ ఈ రోజు పాడేలో నిర్వ‌హించిన బ‌హిరం స‌భ‌లో ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ రాష్ట్రం నెంబర్ 1 అని చంద్రబాబు అంటున్నారని, వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు రాష్ట్రాన్ని నెంబర్ 1 చేశాడ‌న్నారు. ‘‘మద్యం అమ్మకాల్లో, పెట్రోల్ రేట్లలో, రైతుల ఆత్మహత్యల్లో, కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల్లో, ఫీజుల పెంపులో, మహిళల మీద నేరాలు చేసిన మంత్రుల్లో, పార్టీ ఫిరాయింపుల్లో, ప్రతిపక్షాల నాయకులను చంపించడంలో ఏపీని నంబ‌ర్ వ‌న్‌గా నిలిపార‌న్నారు.
ప్రతిపక్షాల వారిపై కేసులు పెట్టడంలో, టీడీపీ నేతలపై కేసులు ఎత్తేయడంలో, గుడి భూములు మింగడంలో, ఓటుకు కోట్లిస్తూ దొరికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడంలో, రాష్ట్ర ఆస్తులను వదులుకోవడంలో, ప్రత్యేక హోదా అడిగితే కేసులు పెట్టడంలో, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడంలో, భూదందాల్లో, ఆక్రమణల్లో, కుంభకోణాల్లో, ఇసుక, మట్టి, బొగ్గు, రాజధాని భూములు, విశాఖ భూములు, దళితుల భూములు దోచేయడంలో రాష్ట్రం ఇప్పుడు నెంబర్ 1లో ఉంద‌ని వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు.

Share