నిరుద్యోగ స‌మస్య లేకుండా చేస్తాం

ఏపీ టాప్ న్యూస్‌: పలాసలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికార టీడీపీపై, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికల సందర్భంగా బాబొస్తే జాబొస్తుందంటూ ప్రజలను నమ్మించారని, అధికారంలోకి బాబు వచ్చినా జాబులు మాత్రం రాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వంలో లక్షా 42వేలుగా ఉన్న ఖాళీల సంఖ్య… ప్రస్తుతం 2 లక్షలకు చేరిందని విమర్శించారు. అయినా, టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. తొలి ప్రాధాన్యం ఉద్యోగాల భర్తీకే ఇస్తామని ప్రకటించారు. ఉద్యోగాల కోసం నిరీక్షిస్తూ.. కోచింగులకోసం డబ్బులు ఖర్చు పెడుతున్న నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తామన్నారు. ఏటా జనవరి 1 వచ్చేనాటికి కొత్త నోటిఫికేషన్ సిద్ధంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
ప్రతీ గ్రామంలో ఒక సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేసి.. స్థానికంగా ఉన్న 10మంది నిరుద్యోగులకు అక్కడే ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. 50కుటుంబాలకు ఒక్కరి చొప్పున గ్రామాల్లో.. వలంటీర్లను ఏర్పాటు చేసి.. గౌరవ వేతనంగా రూ. 5వేలు అందజేస్తామని.. నవరత్నాల్లోని ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజలకు చేరువయ్యేలా వలంటీర్లే చూసుకుంటారని చెప్పారు. అధికారంలోకి రాగానే.. పరిశ్రమల్లో స్థానికులకే అవకాశం కల్పించేలా శాసనసభలో చట్టం తీసుకొస్తామని వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. ఆ చట్టం ప్రకారం పరిశ్రమల్లో 75% మంది స్థానికులే ఉపాధి పొందుతారని.. కొత్తగా వచ్చిన పరిశ్రమలే కాకుండా, పాత పరిశ్రమలు కూడా ఈ చట్టాన్ని అమలు చేయాల్సి ఉంటుందన్నారు. కాంట్రాక్టులన్నింటినీ నిరుద్యోగులకే ఇస్తామని, సబ్సిడీ కింద పెట్టుబడి అందజేసి ప్రోత్సహిస్తామని వైయ‌స్‌ జగన్ హామీ ఇచ్చారు.

Share