వైసీపీని ఓడించాల‌ని ఏక‌మ‌య్యారు

ఏపీ టాప్ న్యూస్‌: ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే… ఏపీ పాలన కేసీఆర్ చేతిలోకి వెళ్లిపోతుందని కొంతకాలంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే నినాదాన్ని మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. చంద్రబాబు ప్రచారం ఎలా ఉన్నా… ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరుకున్న వేళ… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే నినాదాన్ని అందుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో ఆంధ్రావాళ్లపై దాడులు జరుగుతున్నాయనే విధంగా వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్… కేసీఆర్‌ను నేరుగా టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
ఒకరకంగా ఏపీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్, జగన్‌పై విమర్శలు చేయడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి మరో రెండు వారాలు మాత్రమే గడువు ఉండటంతో… ఈ రకమైన ప్రచారం మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్‌, టీఆర్ఎస్ ప్రస్తావనను తీసుకొచ్చి ఏపీలో సెంటిమెంట్‌ను రాజేయడం… తద్వారా వైసీపీని దెబ్బకొట్టడమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తానికి ఏపీ ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్ఎస్‌పై వస్తున్న విమర్శలకు తెలంగాణలోని అధికార పార్టీ కౌంటర్ ఇస్తుందా లేక సైలెంట్‌గా ఉండిపోతుందా అన్నది చూడాలి.

Share