ఢిల్లీ వెళ్లిన బాబు తర్వాత ఏం చేయబోతున్నారు?

ఏపీ టాప్‌ న్యూస్‌: ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం దారుణంగా విఫలమైందని ఆరోపించిన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు… ఈ అంశాన్ని సీఈసీ సునీల్ అరోరా దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం సునీల్ ఆరోరాతో సమావేశం కానున్న చంద్రబాబు… ఏపీలో ఎన్నికలు ఏ విధంగా జరిగాయి… ఈవీఎంలు ఏ రకంగా ఇబ్బందిపెట్టాయనే అంశాలను ఆయనకు వివరించబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన ఏ రకంగా స్పందిస్తారనే దాన్నిబట్టి… ఢిల్లీలో మంత్రులు, ఎంపీలతో కలిసి ధర్నాకు దిగడంపై చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇప్పటికే ఈసీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు… ఈసీ తీరుకు నిరసనగా ధర్నాకు దిగడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారాన్ని జాతి దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల తీరు, ఈవీఎంలపై మొదటి నుంచి సందేహాలు వ్యక్తం చేస్తూ వస్తున్న టీడీపీ అధినేత… మరోసారి ఢిల్లీ వేదికగా తన వాదనను వినిపించబోతున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహం ఉండబోతోందనే టాక్ కూడా వినిపిస్తోంది.

Share