హంగ్ వ‌స్తే..జ‌గ‌న్ కింగ్‌!

ఏపీ టాప్ న్యూస్‌: కేంద్రంలో కాస్త అటూ ఇటుగా హంగ్ తరహా ఫలితాలు వస్తాయనే అంచనాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. బీజేపీ గత ఎన్నికల్లో సాధించిన స్థాయిలో ఈ సారి సీట్లను సాధించలేదు. కాంగ్రెస్ పార్టీ కొద్దో గొప్పో కోలుకుంటుంది కానీ, మరీ అధికారాన్ని సాధించుకునే అవకాశాలు ఉండవు… ఇవీ ఇప్పటికి వినిపిస్తున్న విశ్లేషణలు. రెండో దశ పోలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా అవే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తటస్థ పార్టీలకు మంచి గిరాకీ ఉంటుందని స్పష్టం అవుతూ ఉంది. ప్రస్తుతానికి అయితే తటస్థంగా ఉన్న పార్టీలు కొన్నే. ఎన్నికల వేళ కొన్ని పార్టీలు ఎన్డీయేలో, మరి కొన్ని యూపీఏ వైపు చేరిపోయాయి. అయితే రెండు కూటములకూ దూరంగా ఉన్న పార్టీలు కొన్నే. అలాంటి వాటిల్లో ఒడిశాకు చెందిన బీజేడీ, తెలంగాణకు సంబంధించి టీఆర్ఎస్, ఏపీలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవీ రెండు కూటములకూ దూరంగా ఉన్నాయి.
ఇక వీటిల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రబల శక్తిగా అవతరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏపీలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఎంపీ సీట్ల వరకూ నెగ్గే అవకాశాలు ఉన్నాయనే అంచనాలున్నాయి. హంగ్ తరహా పరిస్థితుల్లో ఇరవై ఎంపీ సీట్ల ను చేతిలో పెట్టుకుంటే.. సదరు పార్టీ వాళ్లే కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కింగ్ మేకర్ అవుతారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అదే జరిగితే జగన్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకహోదాను కూడా సాధించే అవకాశాలున్నాయి.

Share