డీఎల్‌కు పూర్వ వైభ‌వం వ‌స్తుందా?

ఏపీ టాప్ న్యూస్‌: డీఎల్ ర‌వీంద్రారెడ్డి.. రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన నాయ‌కుడు. ముఖ్యంగా క‌డ‌ప జిల్లాలో అయితే ఆయ‌న‌కు ఎదురు ఉండేది కాదు. దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా డీఎల్‌ను బాగానే ప్రోత్స‌హించారు. అయితే చాలా రోజులుగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల ముందు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా డీఎల్ త‌న‌కు ఎమ్మెల్సీ ఇవ్వాల‌ని వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌ను కోర‌గా ఓకే చెప్పార‌ని స‌మాచారం. అయితే మైదుకూరులో వైసీపీని గెలిపించుకుని వ‌స్తేనే అని వైయ‌స్ జ‌గ‌న్ డీఎల్‌కు చెప్పిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. కాగా డీఎల్ రవీంద్రారెడ్డి రాజకీయ భవితవ్యం ఇప్పుడు మైదుకూరు నియోజకవర్గం ఫలితాలపైనే ఆధారపడి ఉందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. డీఎల్ రవీంద్రారెడ్డి సీనియర్ నేత. ఆయన ఆరుసార్లు మైదుకూరు నియోజకవర్గం నుంచి గెలిచి రికార్డు సృష్టించారు. ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెండు ప్రధాన పార్టీల చుట్టూ తిరిగారు. దీంతో డీఎల్ రవీంద్రారెడ్డి అంతా ఆలోచించి చివరకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇదిలా ఉంటే టీడీపీ ని మైదుకూరులో భూస్థాపితం చేస్తానని డీఎల్ శపథం కూడా చేశారు. మైదుకూరు అభ్యర్థికి మద్దతుగా ప్రచారంకూడా చేశారు. అయితే డీఎల్ ఆశలు నెరవేరాలంటే… రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తేనే సరిపోదట. మైదుకూరులో ఖచ్చితంగా గెలిస్తేనే డీఎల్ ను పెద్దల సభకు పంపుతారట. ఇదీ అసలు సంగతి. మరి డీఎల్ ఆశలు నెరవేరాలంటే రెండు జరగాలి. ఒకటి జగన్ సీఎం కావడం. రెండు మైదుకూరులో వైసీపీ జెండా ఎగరడం. ఏదేమైనా మైదుకూరులో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి ర‌ఘురామిరెడ్డి గెలిస్తే మాత్రం డీఎల్‌కు పూర్వ‌వైభ‌వం రావ‌డం ఖాయ‌మ‌ని జిల్లా ప్రజ‌లు చ‌ర్చించుకుంటుండ‌డం విశేషం.

Share