ఆ ఇద్దరూ క‌లుస్తారా?

ఏపీ టాప్ న్యూస్‌: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ఎల్వీ సుబ్రహ్మణ్యానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎల్వీ సుబ్రహ్మణ్యం జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడని చంద్రబాబు పరుష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రికి ఎటువంటి అధికారాలు ఉండవని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీటీడీ గోల్డ్ తరలింపు వ్యవహారంలోనూ, బిల్లుల మంజూరు విషయంలోనూ ఎల్వీ అనుసరించిన తీరును చంద్రబాబు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ నేప‌థ్యంలో కేబినెట్ సమావేశం అనుమతికి సంబంధించి సోమవారానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. సమావేశానికి అనుమతి వచ్చే అవకాశముందని ఆయన అన్నారు. ద్వివేదీ వ్యాఖ్యల నేపథ్యంలో కేబినెట్ సమావేశం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాదాపు గంటల పాటు ఒకే వేదికపై హాజరుఅవ్వాల్సి ఉంటుంది. కేబినెట్ అజెండాలో రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులతో పాటు ఉపాధి హామీ పథకం, తాగునీటి ఎద్దడి వంటి అంశాలు ఉన్నాయి.
అయితే చంద్రబాబు మాత్రం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో బిజినెస్ రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల తీరుపై కూడా చర్చిస్తామని మీడియా సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. అజెండాలోని ప్రధాన అంశాలు పూర్తయిన తర్వాత బిజినెస్ రూల్స్ పై చర్చించే అవకాశముంది. దీంతో ఎల్వీ కూడా చంద్రబాబుతో అమితుమీ తేల్చుకునేందుకే సిద్ధమయ్యారని తెలుస్తోంది. మొత్తం మీద ఎన్నికల కమిషన్ కేబినెట్ సమావేశానికి అనుమతిస్తే అమితుమీ తేల్చుకునేందుకు చంద్రబాబు, ఎల్వీలు సిద్ధపడ్డారని సమాచారం. కేబినెట్ సమావేశం ఉత్కంఠగా జరిగే అవకాశముంది.

Share