ర‌వి ప్ర‌కాష్‌ను అరెస్ట్ చేస్తారా?

ఏపీ టాప్ న్యూస్‌: టీవీ 9 యాజమాన్యం రవి ప్రకాష్ ను సీఈఓ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. మామూలుగా అయితే, ‘ఉద్యోగం’ మారడం అనేది పెద్ద విషయం కాదు. సంస్థ నుంచి వైదొలగడం కూడా అంత వింతేమీకాదు. కానీ, ఇక్కడ రవిప్రకాష్‌ విషయంలోనే చాలా పెద్ద చర్చ జరుగుతోంది.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే హాట్‌ టాపిక్‌. ఆ మాటకొస్తే, దేశవ్యాప్తంగానూ రవిప్రకాష్‌ విషయమై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. కారణం, టీవీ-9 పేరుతో రవిప్రకాష్‌ ఇన్నేళ్ళుగా చేసిన హడావిడి. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్రోతి రాధాకృష్ణ.. వీళ్ళెవరికీ రానంత ‘పేరు’ రవిప్రకాష్‌కి వచ్చిందంటే, అదంతా పాజిటివ్‌ ఫేమ్‌ కాదు. నెగెటివ్‌ ఫేమ్‌. బహుశా ఏ మీడియా సంస్థ అధిపతిపైనా రానన్ని ఆరోపణలు రవిప్రకాష్‌ మీద వచ్చాయి. చివరికి ఆయన ఆ సంస్థ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నిన్ననే టీవీ9లో ప్రత్యక్షమై తన మీద వచ్చిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఇతర మీడియా సంస్థలకు సుద్దులు చెప్పారు.
నిజాయితీతో వార్తలు ప్రసారం చేయాలంటూ క్లాసులు తీసుకున్నారు. తనను ఎవరూ సీఈఓ పదవి నుంచి తొలగించలేరని చెప్పారు. కానీ, ఈ రోజు పదవిపోయింది. రవిప్రకాష్‌తోపాటు సినీనటుడు శివాజీపైనా కేసు నమోదయ్యింది. ఈ కేసులకు సంబంధించి ఇరువుర్నీ అరెస్ట్‌ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ‘నన్ను ఎవరూ తొలగించలేదు..’ అని చెప్పిన రవిప్రకాష్‌, ఈ రోజు టీవీ-9 నుంచి తొలగింపబడ్డారు. నన్ను ఎవరూ అరెస్ట్‌ చేయలేదు, చేయబోరు.. అని రవిప్రకాష్‌ చెప్పారు మరి.. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Share