నంద్యాల సీటు వైసీపీదే

ఏపీ టాప్ న్యూస్‌: నంద్యాల లోక్ స‌భ ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఎన్నిక‌ల్లో ఆరింటిలో వైసీపీకి మెజారిటీ వ‌చ్చింది. నంద్యాల పార్ల‌మెంటు ప‌రిధిలో వైసీపీ బ‌లంగా ఉండ‌టంతో ఎస్పీవై రెడ్డి సులువుగా విజ‌యం సాధించారు. అయితే, ఆళ్ల‌గ‌డ్డ, నంద్యాల‌, శ్రీశైలం ఎమ్మెల్యేలు టీడీపీలో చేర‌డంతో ఈసారి త‌మ‌కు నంద్యాల లోక్ స‌భ ప‌రిధిలో బ‌లం పెరిగింద‌ని టీడీపీ అంచ‌నా వేస్తోంది. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన శిల్పా, గంగుల కుటుంబాలు, చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డి, బిజ్జం పార్థ‌సార‌థి రెడ్డి వంటి నేత‌లు వైసీపీలో చేర‌డంతో త‌మ బ‌లం త‌గ్గ‌లేద‌ని, మ‌రింత పెరిగింద‌ని వైసీపీ ధీమాగా ఉంది. ముస్లింలు, రెడ్లు, బీసీలు నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేసే స్థాయిలో ఉన్నారు. రెడ్లు, ముస్లింలలో వైసీపీ వైపు మొగ్గు ఉంటుంద‌ని, బీసీల్లో టీడీపీకి ఆధిక్య‌త వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నాలు ఉన్నాయి. ఎస్సీల్లో వైసీపీకే మొగ్గు ఉంటుంది. అయితే, ఎస్పీవై రెడ్డి ఎవ‌రి ఓట్లు చీల్చాడ‌నే అంశం గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంది. మొత్తంగా నంద్యాల‌లో మ‌రోసారి వైసీపీకే విజ‌యావ‌కాశాలు ఉన్నట్లు క‌నిపిస్తోంది.

Share