బాబుపైనే ‘అవిశ్వాసం’

అమ‌రావ‌తి: ఆంద్రప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని, విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలు అమ‌లు చేయాల‌ని కోరుతూ కేంద్ర‌ ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ నోటీసుపై ఈ నెల 20వ తేదీ లోక్‌స‌భ‌లో చ‌ర్చ‌కు స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ అంగీక‌రించారు. అయితే టీడీపీ అవిశ్వాస తీర్మానంపై సొంత పార్టీ నేత‌లే తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు అంద‌రూ హాజ‌రు కావాల‌ని టీడీపీ అధిష్టానం తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. అయితే, విప్ జారీ చేసినా తాను పార్లమెంటు సమావేశాలకు వెళ్లబోనని జేసీ దివాకర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అలాగే మ‌రో ఎంపీ సుజ‌నా చౌద‌రి కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది.

కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సభలో వీగిపోవటం ఖాయమని స్పష్టం చేశారు. రాజకీయ వాతావరణం బాగాలేదంటూ టీడీపీ వైఖరిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందుకే పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కావడంలేదని జేసీ తెలిపారు. అవిశ్వాస తీర్మానం వల్ల చర్చ మాత్రమే జరుగుతుందన్నారు.ఈ చర్చలో ఇద్దరు లేదా ముగ్గురు టీడీపీ ఎంపీలు మాట్లాడతారని పేర్కొన్నారు. నాకంటే ఇంగ్లిష్‌, హిందీ బాగా మాట్లాడేవారు ఉన్నారని జేసీ వ్యంగ్యంగా స్పందించారు. ఓ వైపు కేంద్రంపై పోరాటం చేస్తున్నామని బీరాలు పలుకుతున్న టీడీపీ.. సొంత పార్టీ ఎంపీ వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడింది.

నాలుగేళ్లు ఎన్‌డీఏ కూట‌మిలో కొన‌సాగిన టీడీపీ ఇటీవ‌ల ఆ కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేదు..అదేమైనా సంజీవ‌నా? హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుప‌డ్డాయ‌ని గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్షాల‌ను హేళ‌న‌గా మాట్లాడారు. ఇప్పుడు యూట‌ర్న్ తీసుకొని ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న‌ట్లు క‌ల‌రింగ్ ఇస్తూనే ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌ద్ద వంగి వంగి న‌మ‌స్కారాలు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనికి తోడు చంద్ర‌బాబు బ‌య‌ట బీజేపీతో యుద్ధ‌మంటూనే..లోప‌ల బీజేపీ నేత‌ల‌తో స‌త్సంబంధాలు కొన‌సాగిస్తున్నారు. మ‌హారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్య‌ను టీటీడీ బోర్డు మెంబ‌ర్‌గా నియ‌మించారు. కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామ‌న్ భ‌ర్త ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌ను చంద్ర‌బాబు వెంట తిప్పుకుంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితిలో చంద్ర‌బాబు ఇప్పుడు కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా డ్రామానే అని సొంత పార్టీ నేత‌లే బ‌హిరంగంగా పేర్కొంటున్నారు. వీరిలో జేసీ దివాక‌ర్‌రెడ్డి మ‌రో అడుగు ముందుకు వేసి త‌న నిర్ణ‌యాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

మ‌రోవైపు చంద్ర‌బాబుపై త‌మ‌కు న‌మ్మ‌కం లేద‌ని వివిధ పార్టీల నాయ‌కులు పేర్కొంటున్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు రానుంది. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వడం లేదని తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి స్పష్టం చేశారు. ఈ తీర్మానానికి టీఆర్‌ఎస్‌ మద్దతివ్వదని ఆ పార్టీ ఎంపీ కవిత ముందుగానే సంకేతమిచ్చిన విషయం తెలిసిందే.​ ఇతర పార్టీల మద్దతు కూడగడతామంటూ పైకిచెబుతున్నా.. అవిశ్వాసానికి సొంత నేతల మద్దతే టీడీపీకి లేదని జేసీ వ్యవహారం చాటుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, జేసీ దివాకర్ రెడ్డి అవిశ్వాసంపై చర్చకు హాజరుకావాలని… విప్ ను ధిక్కరిస్తే జేసీపై చర్యలు తప్పవని చెప్పారు. ఎవ‌రెన్ని చెప్పినా చంద్ర‌బాబుపై సొంత పార్టీలో తిరుగుబావుటా మొద‌లైంద‌ని, ఆయ‌న‌పై త‌మ్మ‌ళ్ల‌కు విశ్వాసం లేద‌న్న‌ది అక్ష‌ర స‌త్యం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × one =