ఆసీస్‌పై టీమిండియా విజ‌యం చిర‌స్మ‌ర‌ణీయం

ఏపీ టాప్ న్యూస్‌: ఆడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. తొలిటెస్టులో 31 పరుగుల తేడాతో ఆసీస్ ను కోహ్లీసేన ఓడించింది. టీమిండియా 323 పరుగుల టార్గెట్ ఉంచగా.. 291 పరుగులకే ఆసీస్ కుప్పకూలింది. ఫలితంగా మ్యాచ్ భారత్ వశమైంది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఈ విజయం సాధ్యపడింది. ఈ మ్యాచ్ లో బుమ్రా, ఆశ్విన్ , షమీ తలో మూడు వికెట్లు తీసి ఆసీస్ కు కోలుకోని స్థితిలో పడేశారు. ఒక వైపు ఆసీస్ వికెట్లు పతనమౌతున్నప్పటికీ భారత బౌలర్లపై నాథన్ లయన్ (38) ఎదురుదాడి చేశాడు. దీంతో సునాయస విజయం కాస్త..కోహ్లీసేనకు చెమటోడ్చి నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఈ విజయంతో నాల్గు మ్యాచ్ ల టెస్టు సీరిస్ లో భారత్ 1 – 0 ఆధిక్యంలో ఉంది. కాగా ఈ విజయంతో కోహ్లీ సేన సరికొత్త రికార్డు సృష్టించింది. పదేళ్ల విరామం తర్వాత ఆసీస్ గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.
ఓవర్‌నైట్ స్కోరు 104/4తో ఈరోజు రెండో ఇన్నింగ్స్‌ని ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు తొలి సెషన్‌లోనే ట్రావిస్ హెడ్ (14) వికెట్ చేజార్చుకుంది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ టిమ్‌పైన్ (41: 73 బంతుల్లో 4×4)‌తో కలిసి నెమ్మదిగా ఆడిన షాన్ మార్ష్ (60: 166 బంతుల్లో 5×4) భారత్ శిబిరంలో కంగారు పెంచాడు. కానీ.. ఈ ఇద్దరినీ.. తెలివైన బంతులతో బోల్తా కొట్టించిన జస్‌ప్రీత్ బుమ్రా.. మ్యాచ్‌ని భారత్‌వైపు తిప్పాడు. అయితే.. ఆఖర్లో మాత్రం మిచెల్ స్టార్క్ (28: 44 బంతుల్లో 2×4), పాట్ కమిన్స్ (28: 121 బంతుల్లో 3×4), నాథన్ లయన్ (38 నాటౌట్: 47 బంతుల్లో 3×4) భారత్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ ఆస్ట్రేలియా జట్టులో ఆశలు రేపారు కానీ.. జట్టు స్కోరు 291 వద్ద అశ్విన్ వారి గెలుపు ఆశలకి చెక్ చెప్పాడు.

Share