ప్ర‌త్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం

ఏపీ టాప్ న్యూస్‌: ప‌్ర‌త్యేక హోదా కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ పోరాటానికి సిద్ధ‌మైంది. ఢిల్లీ వేదిక‌గా రేపు దీక్ష చేప‌ట్ట‌బోతోంది. `వంచ‌న‌పై గ‌ర్జ‌న‌` పేరుతో చేపట్ట‌బోయే ఈ దీక్ష‌లో పాల్గొనాల‌ని, పార్టీ శ్రేణుల‌కు ఇప్ప‌టికే ఆదేశాలుకూడా పంపించింది. హోదా కోరుకునే అంద‌రూ దీక్ష‌కు మ‌ద్ద‌తు తెలిపి విజ‌యవంతం చేయాల‌ని కూడా కోరింది. అయితే ఈ రోజు ఢిల్లీలో `వంచ‌న‌పై గ‌ర్జ‌న` దీక్ష‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను ఆ పార్టీ నాయ‌కులు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి, మాజీ ఎంపీలు మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సీనియ‌ర్ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. ఎన్నిక‌ల ముందు తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర స్వామి సాక్షిగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని, అధికారంలోకి రాగానే ఏపీకి ప్ర‌త్యేక హోదా తెస్తామ‌ని చెప్పిన మోడీ, చంద్ర‌బాబులు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏపీకి హోదా ఇవ్వ‌కుండా అన్యాయం చేశార‌న్నారు.
ప్ర‌త్యేక హోదా అన్న‌ది ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అని, ఏపీకి హోదా ఇవ్వ‌కుండా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌ను మోసం చేశాయ‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసి ఏ నాడూ ప్ర‌త్యేక హోదా అడ‌గ‌లేద‌న్నారు. పైగా ప్ర‌త్యేక హోదా వ‌ద్దు.. ప్యాకేజీ ముద్ద‌ని అన్నార‌ని, హోదా కోసం పోరాడుతున్న వాళ్ల‌ను సైగం చంద్ర‌బాబు జైళ్లో పెట్టించార‌న్నారు. బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు ఇప్పుడు దొంగ డ్రామాలు ఆడుతున్నార‌న్నారు. ప్ర‌త్యేక హోదా కోసం తానే పోరాడుతున్న‌ట్లు బిల్డ‌ప్ ఇస్తున్నారు. తాము ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామా చేసి పోరాడుతున్నామ‌ని, త‌మ‌కు రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌న్నారు. మా నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ నేతృత్వంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌చ్చే వ‌ర‌కు పోరాటం చేస్తూనే ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

Share