దిగివ‌చ్చిన చంద్ర‌బాబు

న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు 40 ఏళ్ల వయ‌సు ఉన్న ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెంట న‌డిచేందుకు ముందుకు వ‌చ్చారు. ప్ర‌త్యేక హోదాకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్న జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ప‌లికారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రేపు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై అందుబాటులో ఉన్న మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చలు జరిపి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ పెట్టనున్న తీర్మానానికి తమ ఎంపీలు మద్దతివ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ ఇచ్చి, ఆ తర్వాత ఆ హామీని తుంగలో తొక్కిన మోదీ ప్రభుత్వంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్ సభ జనరల్ సెక్రటరీని కలసి నోటీసులను అందజేశారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చిందని… ఆ తర్వాత హామీని విస్మరించిందంటూ నోటీసులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, తమ అవిశ్వాస తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సిందేనని చెప్పారు.

వాస్తవానికి అవిశ్వాస తీర్మానాన్ని మార్చి 21న పెట్టాలని గతంలో వైసీపీ భావించింది. అయితే, వ్యూహాత్మకంగా ఆ తేదీని ముందుకు తీసుకొచ్చారు. అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీ స్పందన కోసమే 21వ తేదీని నిర్ణయించినట్టు ఇంతకు ముందు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. తాజాగా, వైసీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నిర్ణయించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మద్దతు ఇద్దామని పార్టీ నేతలకు ఆయన స్పష్టం చేశారు.

కాగా, ప్ర‌త్యేక హోదా విష‌యంపై ఇటీవ‌ల చంద్ర‌బాబు త‌న పార్టీకి చెందిన కేంద్ర మంత్రుల‌తో రాజీనామా చేయించారు. అలాగే నాలుగేళ్లుగా ప్ర‌త్యేక హోదా వ‌ద్దు అంటు చెప్పిన ముఖ్య‌మంత్రి ఇటీవ‌ల మ‌న‌సు మార్చుకొని హోదా ఇవ్వాల్సిందే అని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌న్నింటికి జ‌గ‌న్ చేప‌ట్టిన హోదా ఉద్య‌మ‌మే కార‌ణ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏది ఏమైనా రాష్ట్రం కోసం మొద‌టిసారి అధికార పార్టీ ప్ర‌తిప‌క్షానికి మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం శుభ‌ప‌రిణామం. ఎన్‌డీఏ ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

News Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *