రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనా యజ్ఞం చేస్తుంటే, ఓటమి ఫ్రస్ట్రేషన్లో ఉన్న వైసీపీ నేతలు రాక్షసుల్లా అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనా యజ్ఞం చేస్తుంటే, ఓటమి ఫ్రస్ట్రేషన్లో ఉన్న వైసీపీ నేతలు రాక్షసుల్లా అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో విద్వేషాలు రగిల్చేందుకు, సమాజంలో అశాంతి రేపేందుకు ఆ పార్టీ అడుగడుగునా కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడుతోందని సీఎం ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో జరిగిన ‘పేదల సేవలో’ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రజావేదిక సభ ద్వారా వైసీపీ ఆడుతున్న డ్రామాలను ప్రజల ముందు ఉంచారు. "గత పాలనలో పూర్తిగా ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు మేము రాత్రీ పగలు శ్రమిస్తుంటే, వైసీపీ ఇంకా విధ్వంసాన్ని కొనసాగించాలని చూస్తోంది. వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి చంపి గుండెపోటు అన్న వాళ్లు.. ఒక్క ఛాన్స్ పేరిట కోడికత్తి, గులకరాయి నాటకాలు ఆడారు. పాలన అనేది వైకుంఠపాళి కాకూడదన్నదే మా విజ్ఞప్తి" అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు వైసీపీ చేసిన పలు కుట్రలను సీఎం ఈ సందర్భంగా ఎండగట్టారు. "మేము అత్యంత పారదర్శకంగా, కంప్యూటర్ సిస్టమ్ ద్వారా కోర్టు కేసులు పరిష్కరించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తే.. దానిపై కూడా వైసీపీ వివాదం చేయాలని చూసింది. పరామర్శల డ్రామా కోసం వెళ్తూ సొంత కార్యకర్త సింగయ్యను కారు కింద తొక్కి చంపి పొదల్లో వేసి, ఆ హత్యానేరాన్ని మాపై నెట్టాలని చూశారు. కడపలో దస్తగిరిని వైసీపీ వారే ఆస్తుల వివాదంలో చంపి టీడీపీపై తోయాలని చూశారు. నంద్యాలలో రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసింది సాక్షాత్తూ వైసీపీ కార్యకర్తే. అందుకే ఆ వార్త 'సాక్షి' పత్రికలో రాలేదు. తిరుమలలో కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద సాక్షి మీడియా ప్రతినిధులే స్వయంగా మద్యం బాటిళ్లు పారేసి శ్రీవారిని అప్రతిష్ట పాలు చేయాలని చూశారు. కుట్రలతో హిందూ దేవాలయాలను అపవిత్రం చేసే వారి ఆటలు సాగనివ్వం" అని చంద్రబాబు హెచ్చరించారు. గతంలో వైసీపీ ఎమ్మెల్సీ దళితుడైన డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ పార్టీ సన్మానాలు చేసిందని, తప్పులు సరిచేసుకోకుండా ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"గత ప్రభుత్వ విధ్వంసం నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించిన రోజుగా జూన్ 4వ తేదీ చరిత్రలో నిలిచిపోతుంది" అని ముఖ్యమంత్రి అన్నారు. రూ.10 లక్షల కోట్ల అప్పులు, బకాయిలు ఉన్నప్పటికీ పెన్షన్లను రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచామని, దివ్యాంగులకు రూ.6 వేలు, హెల్త్ పెన్షన్లు రూ.10 వేల నుండి రూ.15 వేలకు పెంచామని గుర్తుచేశారు. "కూటమి అధికారంలోకి వచ్చిన 2024 జూలై నుండి ఇప్పటివరకు మొత్తం రూ.65,887 కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రూపంలో అందించాం. ఏడాదికి దాదాపు రూ.32 weల కోట్లు ఈ ఒక్క పథకానికే ఖర్చు పెడుతున్నాం. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇవ్వడం లేదు" అని స్పష్టం చేశారు. బటన్ నొక్కి పైశాచిక ఆనందం పొందడం కాకుండా, ప్రతి నెలా 1వ తేదీన నేరుగా ప్రజలను కలిసి కష్టసుఖాలు తెలుసుకుంటూ పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఈ నెలలో 62.34 లక్షల మందికి రూ.2,729 కోట్లు పంపిణీ చేశామని, కొత్తగా 5,606 మందికి రూ.2.24 కోట్ల స్పౌజ్ పెన్షన్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్ర యువత ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా పారిశ్రామికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. "రాబోయే 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో 23 లక్షల ఉద్యోగాలను తీసుకురావడమే మా లక్ష్యం. కాకినాడ సమీపంలో రూ.80 వేల కోట్లతో గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ, తుని పక్కనే అనకాపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ సిటీ, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రాబోతున్నాయి. ‘PM సేతు’ కింద ఏడాదికి 25 వేల మంది యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తున్నాం. కేంద్ర సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పునరుద్ధరించడమే కాకుండా, ఉత్తరాంధ్ర ప్రజల కల అయిన విశాఖ రైల్వే జోన్‌ను సాకారం చేశాం" అని చంద్రబాబు ప్రకటించారు.
పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ని తీసుకువస్తున్నామని, ‘సంజీవని’ పేరుతో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ రికార్డులను రూపొందించి ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానంలో పర్యవేక్షిస్తామన్నారు. అలాగే, జూన్ నెలలో అమరావతి వేదికగా 14 రోజుల పాటు జరిగే ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. 2047 స్వర్ణాంధ్ర విజన్ ద్వారా రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని, శ్రీకాకుళం నుండి ఉమ్మడి తూర్పుగోదావరి వరకు విశాఖ రీజియన్‌గా, పశ్చిమగోదావరి నుండి ప్రకాశం వరకు అమరావతి రీజియన్‌గా, తిరుపతి కేంద్రంగా రాయలసీమ రీజియన్‌ను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున సమర్థ నీటి నిర్వహణకు సన్నద్ధమయ్యామని, జూలై లోగా పోలవరం ఎడమ కాలువ పూర్తి చేసి విశాఖకు నీరు తీసుకెళ్తామని సీఎం తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం రూ.240 కోట్లతో 200 మెకనైజ్డ్ బోట్లను సబ్సిడీపై అందిస్తున్నామని, అమినాబాద్ ఫిషింగ్ హార్బర్ కోసం రూ.80 కోట్లు మంజూరు చేసి పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
పేదరికం లేని సమాజమే 'P4' లక్ష్యం:
ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ‘P4’ (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్షిప్) ద్వారా మార్గదర్శులు బంగారు కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచేలా కృషి చేస్తున్నామన్నారు. అనంతరం సభావేదిక వద్ద తనను కలవడానికి వచ్చిన ఒక దివ్యాంగ యువకుడి భుజంపై చేయి వేసి ఆప్యాయంగా పలకరించి ఫోటో దిగిన ముఖ్యమంత్రి, అతనికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందించాలని కాకినాడ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పి.నారాయణ, తుని ఎమ్మెల్యే యనమల దివ్య, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.