ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణకు సంకల్పం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణకు సంకల్పం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జూన్ 5న తాను విశాఖపట్నం పర్యటనలో భాగంగా సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు సీఎం సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. భూమి మన ఇల్లు, ప్రకృతి మన జీవనాధారమని పేర్కొన్న ఆయన, పర్యావరణాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సహజ వనరులను కాపాడుకోవడంతో పాటు గాలి, నీరు, నేల కలుషితం కాకుండా అందరూ కృషి చేయాలని సూచించారు.
పచ్చదనం పెంపు, ఇంధన వనరుల పొదుపు వినియోగం నేటి అవసరమని పేర్కొన్న ముఖ్యమంత్రి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలు సైకిళ్లు, ఈ-సైకిళ్లపై ప్రయాణించాలని కోరారు. అలాగే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రేపటి విశాఖ పర్యటనలో సైకిల్‌పై ప్రయాణించడం ద్వారా పర్యావరణ హిత జీవన విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మంచి కార్యక్రమానికి అందరూ కలిసి రావాలని, పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.
1 రోజుల క్రితం

14 గంటల క్రితం