దేశీయంగా ఎల్పీజీ (LPG) ధరలను సిలిండర్‌కు మరో రూ.29 మేర పెంచుతూ కేంద్ర పెట్రోలియంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
.jpg&w=3840&q=75)
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే చాలు, ఆ భారాన్ని సామాన్యుడి నెత్తినే రుద్దడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను సాకుగా చూపుతూ, దేశీయంగా ఎల్పీజీ (LPG) ధరలను సిలిండర్‌కు మరో రూ.29 మేర పెంచుతూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ ధరల పెంపును సమర్థించుకునేందుకు ప్రభుత్వం ఎప్పటిలాగే విచిత్రమైన వాదనను తెరపైకి తెచ్చింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దగ్గరే వంట గ్యాస్ చాలా చౌకగా లభిస్తోందంటూ జూన్ 7న మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కానీ, క్షేత్రస్థాయిలో సామాన్యుడి ఆర్థిక పరిస్థితిని, ఆదాయ వనరులను పట్టించుకోకుండా కేవలం ఇతర దేశాల ధరలతో పోల్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదాస్పద నిర్ణయం , ప్రభుత్వ లెక్కల వెనుక ఉన్న అసలు నిజాలు ఇవే
పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా రేట్లు పెరిగాయని, అందుకే దేశీయంగా ధరలు పెంచక తప్పలేదని ప్రభుత్వం చెబుతోంది. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలోనే సాధారణ వినియోగదారులు ఒక్కో సిలిండర్‌కు ఏకంగా రూ.942 చెల్లించాల్సి వస్తోంది. ఇక ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు మొదటి నాలుగు రీఫిల్స్‌పై ఇచ్చే సబ్సిడీలను కలుపుకుంటే రూ.642 కే లభిస్తుందని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. అయితే, ఏడాదికి కేవలం నాలుగు రీఫిల్స్‌కు మాత్రమే ఈ రాయితీ పరిమితం కావడం, మిగిలిన సిలిండర్లను వారు కూడా పూర్తి ధరకే కొనాల్సి రావడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. పైగా ప్రాంతాల వారీగా రవాణా ఖర్చులు అంటూ రిటైల్ ధరల్లో మరికొంత అదనపు భారం పడే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖే స్వయంగా ఒప్పుకోవడం గమనార్హం.
భారతదేశంలో గ్యాస్ ధరలు ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఉన్నాయంటూ ప్రభుత్వం పొరుగు దేశాల, అగ్రరాజ్యాల జాబితాను బయటపెట్టింది. పాకిస్థాన్‌లో సిలిండర్ ధర రూ.1,046, నేపాల్‌లో రూ.1,207, బంగ్లాదేశ్‌లో రూ.1,225, శ్రీలంకలో రూ.1,241 ఉంటే.. అమెరికాలో రూ.1,755, కెనడాలో రూ.2,411 వరకు ఉందని లెక్కలు చెబుతోంది. కానీ, అమెరికా, కెనడా వంటి దేశాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు, వారి నెలవారీ ఆదాయాలతో పోలిస్తే, భారతదేశంలోని సామాన్యుడి సగటు ఆదాయం ఎంత? అక్కడ సంపాదనకు తగ్గట్టుగా ధరలు ఉంటే, ఇక్కడ రెక్కాడితే గానీ డొక్కాడని పేదలపై ఈ స్థాయి ధరల భారం న్యాయమేనా? అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పొరుగు దేశాల సంక్షోభ పరిస్థితులను మన ఆర్థిక వ్యవస్థతో పోల్చడం హాస్యాస్పదంగా ఉందని విమర్శలు వస్తున్నాయి.
భారతదేశం తన ఎల్పీజీ అవసరాల కోసం ఏకంగా 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ ధరలను సౌదీ అరామ్కో నిర్ణయించే 'సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్' (Saudi CP) శాసిస్తుంది. దీనిపై భారతీయ వినియోగదారులకు కానీ, ప్రభుత్వానికి కానీ ఎలాంటి నియంత్రణ లేదు. హార్ముజ్ జలసంధి వివాదం తర్వాత, ఫిబ్రవరిలో టన్నుకు 543 డాలర్లుగా ఉన్న సౌదీ సిపి ధర, జూన్ నాటికి ఏకంగా 790 డాలర్లకు (సుమారు 46 శాతం) ఎగబాకింది. దేశీయంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులను గట్టిగా అభివృద్ధి చేయడంలో వైఫల్యం చెందడం వల్లే, అంతర్జాతీయంగా చిన్న మార్పు వచ్చినా ఆ భారం నేరుగా వచ్చి భారతీయ వంటగదిపై పడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జూన్ నాటి కాంట్రాక్ట్ ధరల ప్రకారం ఒక గ్యాస్ సిలిండర్ సరఫరా ఖర్చు రూ.1,600 దాటిందని, అందుకే తాము ప్రతి సిలిండర్‌పై రూ.700 భారాన్ని (అండర్-రికవరీ) భరిస్తూ వినియోగదారుడికి రూ.942 కే ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. హోటళ్లు వాడే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ రూ.3,113.50 (కిలోకు రూ.164) కి అమ్ముతుంటే, గృహ వినియోగదారులకు కిలోకు రూ.66 మాత్రమే ఇస్తున్నామని అంటోంది. గత ఆర్థిక సంవత్సరానికి గాను ఈ సంచిత అండర్-రికవరీ భారం రూ.60,000 కోట్లకు చేరిందని, దానికి కేంద్ర కేబినెట్ రూ.30,000 కోట్ల పరిహారం ఆమోదించిందని వివరించింది. అయితే, ఇదంతా ప్రభుత్వ అంతర్గత మేనేజ్మెంట్ లోపాలే తప్ప, సామాన్యుడికి తాము ఏదో పెద్ద సాయం చేస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి.
హార్ముజ్ జలసంధి మూతపడినా, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దేశీయ ఉత్పత్తిని 32 TMT నుంచి 52 TMT కి పెంచామని, అమెరికా, కెనడాల నుంచి దిగుమతులు తెచ్చామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. నౌకల రవాణాను సమన్వయం చేసి కొరత లేకుండా చూశామని చెప్తున్న ప్రభుత్వం.. అంతా సజావుగా నడుస్తున్నప్పుడు ధరలను ఎందుకు పెంచాల్సి వచ్చిందనే ప్రశ్నకు సమాధానం దాటవేస్తోంది. మరోవైపు, సబ్సిడీ గ్యాస్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి ఓటిపి (OTP) వెరిఫికేషన్‌ను 90 శాతానికి పెంచామని, వినియోగదారులను పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వైపు మళ్లిస్తున్నామని చెబుతోంది. డిజిటల్ పద్ధతులు, పటిష్ట చర్యలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ధరల మంటలు మాత్రం తగ్గడం లేదు. "గ్యాస్ మన దగ్గరే చౌక" అనే ప్రచార ఆర్భాటాల వెనుక సామాన్యుడి జేబుకు పడుతున్న చిల్లులను ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని విపక్షాలు, వినియోగదారుల సంఘాలు మండిపడుతున్నాయి.