పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం సిద్ధాంతం వేదికగా ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలు పంపిణి చేశారు.

"గత పాలకుల దుర్మార్గపు నిర్ణయాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అనే నల్ల చట్టం ద్వారా రైతుల భూములను కాజేసేందుకు జరిగిన కుట్రలను మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాశ్వతంగా సమాధి చేసింది. రైతుల భూములకు నూటికి నూరు శాతం యాజమాన్య హక్కులను కల్పిస్తూ, కరెన్సీ నోట్లకు ఉండే స్థాయి భద్రతా ఫీచర్లు, రాజముద్రతో కూడిన సరికొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నాం" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం సిద్ధాంతం వేదికగా ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలు పంపిణి చేశారు.
ఈ సభలో కేంద్రమంత్రి పెన్మత్స శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సహా ఉన్నతాధికారులు, లక్షలాది మంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు నేరుగా సరికొత్త డిజిటల్ భద్రతా ఫీచర్లు కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసి మాట్లాడారు.
ఉమ్మడి గోదావరి జిల్లాలు పచ్చదనంతో అలరారుతూ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణలని ముఖ్యమంత్రి కొనియాడారు.
"బ్రిటిషర్ల కాలం నాటి పటిష్టమైన రికార్డుల వల్ల ఏపీలో రెవెన్యూ సమస్యలు తక్కువగా ఉండేవి. కానీ, గత ఐదేళ్ల దుర్మార్గపు పాలనలో రికార్డులను తారుమారు చేసి, ప్రైవేటు సంస్థలకు అప్పగించి గందరగోళం సృష్టించారు. భూమి రైతులదైతే.. పాస్ పుస్తకాలు, పొలం సరిహద్దు రాళ్లపై మాత్రం నాటి పాలకుడి బొమ్మలు ముద్రించుకున్నారు. భూతం తరహాలో రైతుల వెంటపడి, ప్రజాధనం రూ.800 కోట్లు తగలేసి గెలాక్సీ గ్రానైట్ రాళ్లపై బొమ్మలు వేసుకున్నారు" అని సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఒక వ్యక్తి చేసిన ఈ దుర్మార్గాన్ని సరిదిద్ది, భూ రికార్డులను ప్రక్షాళన చేయడానికి తమ ప్రభుత్వానికి మూడేళ్ల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.