ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కీలక మార్పులు. కడప, రాజంపేట, మైదుకూరు, తిరుపతి వార్డుల్లో అక్టోబరు 23, 24 తేదీల్లో మళ్లీ నామినేషన్లు. నవంబరు 1న పోలింగ్, 3న కౌంటింగ్.

ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. నామినేషన్లు దాఖలు చేయకుండా కొందరు అభ్యర్థులను అడ్డుకున్నట్లు గుర్తించిన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లోని నిర్దిష్ట వార్డులకు మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు నామినేషన్ల స్వీకరణ గడువును 48 గంటలపాటు పొడిగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులను బెదిరించడం, దాడులకు పాల్పడటం, నామినేషన్ పత్రాలను చించివేయడం తదితర ఘటనలు చోటుచేసుకున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారుల నివేదికలతోపాటు అభ్యర్థులు సమర్పించిన వినతులు, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.
నాలుగు పట్టణాల్లోని వార్డులకే అవకాశం
కడప నగరపాలక సంస్థలో 6, 11, 13, 15, 16, 17, 24, 31, 34, 52, 55వ వార్డుల్లో నామినేషన్లను స్వీకరిస్తారు. రాజంపేట పురపాలక సంఘంలో 6, 12, 13, 14, 17, 19, 23, 24, 25, 26, 27వ వార్డులకు ఈ అవకాశం కల్పించారు. మైదుకూరు పురపాలక సంఘంలోని అన్ని వార్డుల్లోనూ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. తిరుపతి నగరపాలక సంస్థలో 1, 2, 3, 4, 5, 6, 9, 11, 12, 13, 14, 19, 55, 56, 57, 59, 65, 66వ వార్డులకు గడువు పొడిగించారు. ఈ నెల 23, 24 తేదీల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇప్పటికే ప్రకటించిన కేంద్రాలతోపాటు సంబంధిత కలెక్టర్లు సూచించిన కలెక్టరేట్ ప్రాంగణాల్లోనూ నామినేషన్ పత్రాలను అందజేయవచ్చు.
నవంబరు 1న పోలింగ్.. 3న లెక్కింపు
సవరించిన షెడ్యూల్ ప్రకారం కొత్తగా దాఖలైన నామినేషన్ల పరిశీలన అక్టోబరు 25న ఉదయం 8 గంటల నుంచి చేపడతారు. కొత్తగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు అదే రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరించుకోవచ్చు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల తర్వాత తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు నవంబరు 1న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అవసరమైతే నవంబరు 2న రీపోలింగ్ చేపడతారు. నవంబరు 3న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
పరోక్ష ఎన్నికల షెడ్యూల్ వేరుగా..
విజయనగరం నగరపాలక సంస్థతో సహా మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో తుది అభ్యర్థుల జాబితా ప్రచురణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సవరించిన షెడ్యూల్ను వర్తింపజేశారు. మేయర్, డిప్యూటీ మేయర్, పురపాలక సంఘాల ఛైర్పర్సన్ తదితర పదవులకు నిర్వహించే పరోక్ష ఎన్నికల షెడ్యూల్ను ప్రత్యేకంగా ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.