నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని, తొమ్మిది, పదో తరగతుల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 'దేవరకొండ ఫౌండేషన్' ఆధ్వర్యంలో భారీ నగదు పురస్కారాలను అందజేశారు.

సినీ గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతలోనూ తాము 'రియల్ హీరోల'మని నిరూపించుకున్నారు టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని, తొమ్మిది, పదో తరగతుల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 'దేవరకొండ ఫౌండేషన్' ఆధ్వర్యంలో భారీ నగదు పురస్కారాలను అందజేశారు. బల్మూరు మండలంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన ఈ సేవా కార్యక్రమం స్థానిక విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తమ సొంత ప్రాంత విద్యాభివృద్ధి కోసం ఈ నూతన దంపతులు తీసుకున్న చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని 47 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఈ పురస్కారాల కోసం ఎంపిక చేశారు. 9వ, 10వ తరగతుల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన మొత్తం 181 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఫౌండేషన్ తరఫున ఆర్థిక ప్రోత్సాహకాలు అందించారు. ఇందులో భాగంగా స్కూల్ ఫస్ట్ సాధించిన విద్యార్థులకు రూ.10,000 చొప్పున, సెకండ్ ర్యాంక్ సాధించిన వారికి రూ.5,000 చొప్పున నగదు బహుమతులను విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న చేతుల మీదుగా అందజేసి వారిని అభినందించారు. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు మాధవి, గోవర్ధన్ రావు కూడా పాల్గొని పిల్లలను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఎంత ఎదిగినా తమ స్వగ్రామ ప్రాంతాన్ని, మూలాలను మరవకుండా ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న విజయ్-రష్మిక దంపతులను ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి ప్రోత్సాహకాలు గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇంధనంలా పనిచేస్తాయన్నారు. ఇదే వేదికపై నుంచి ఆయన ఒక కీలక ప్రతిపాదన చేశారు. అచ్చంపేట ప్రాంతంలో పేద పిల్లలకు సైతం కార్పొరేట్ స్థాయి విద్య అందేలా.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక మోడల్ పాఠశాలను ఏర్పాటు చేయాలని దేవరకొండ ఫౌండేషన్‌ను ఎమ్మెల్యే కోరారు.
పురస్కారాలు అందుకున్న విద్యార్థులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. విద్యార్థులు కేవలం మార్కుల కోసమే కాకుండా క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే జీవితంలో అనుకున్న ఉన్నత శిఖరాలను సులభంగా చేరుకోవచ్చని సూచించారు. విద్యార్థుల ఎదుగుదలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ ఒక మంచి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కుంగిపోవద్దని, ఓటమి అనేది ముగింపు కాదని.. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగితే విజయాలు వరిస్తాయని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) రమేష్, పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమం టౌన్లో పెద్ద టాపిక్‌గా మారింది.