తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకొచ్చి ఆదర్శంగా నిలిచారు.

యర్రగొండపాలెం: తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకొచ్చి ఆదర్శంగా నిలిచారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని వీరభద్రాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదివిన 32 మంది పూర్వ విద్యార్థులు రూ.2.70 లక్షల వ్యయంతో ఆధునిక ప్లే జోన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు పాఠశాల ఆవరణలో సరస్వతి దేవి విగ్రహంతో పాటు అంబేద్కర్, మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద లాంటి మహనీయుల విగ్రహాలను ప్రతిష్ఠించారు.
ఆధునిక ప్లే జోన్
తమ బాల్య జ్ఞాపకాలను పదిలపరుచుకుంటూ, చదువుల బడి అభివృద్ధికి తోడ్పడాలనే సంకల్పంతో పూర్వ విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది. చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి దోహదపడేలా అత్యాధునిక ఆట వస్తువులతో ప్లే జోన్‌ను ఏర్పాటు చేశారు. అలాగే మహనీయుల విగ్రహాల ఏర్పాటు ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, నైతిక విలువలు, ఉన్నత ఆశయాల పట్ల అవగాహన పెంపొందించే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సేవాభావాన్ని పలువురు అభినందించారు. తమకు విద్యను అందించిన పాఠశాల పట్ల కృతజ్ఞతాభావంతో వారు చేపట్టిన కార్యక్రమం ఇతర పూర్వ విద్యార్థులకు సైతం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం పెరిగితే విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. తమ చదువుల బడికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకొచ్చిన వీరభద్రాపురం పూర్వ విద్యార్థుల సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, వారి స్ఫూర్తితో మరిన్ని పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.