గనుల రంగంలో పారదర్శక సంస్కరణలు, ఉచిత ఇసుక విధానం, డిజిటలైజేషన్‌తో రాష్ట్ర ఆదాయం పెరిగిందని, గత ప్రభుత్వ హయాంలో రూ.19,137 కోట్ల నష్టం జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

రాష్ట్ర గనుల రంగంలో పారదర్శకత, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ, విధాన సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆదాయ వృద్ధికి కొత్త ఊపునిచ్చామని రాష్ట్ర ఎక్సైజ్, గనులు & భూగర్భశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ మైనింగ్, ఇసుక దోపిడీ, ఖనిజ సంపద కేంద్రీకరణ వల్ల రాష్ట్రానికి రూ.19,137 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు.
సచివాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, గనుల రంగ పునరుజ్జీవనానికి అమలు చేస్తున్న AP Minor Mineral Policy-2025 ద్వారా పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. గత రెండేళ్లలో 1,700కు పైగా దరఖాస్తులు అందగా, 172 కొత్త మైనింగ్ లీజులు మంజూరు చేయడంతో రాష్ట్రానికి రూ.172 కోట్ల ఆదాయం లభించిందన్నారు. గత ప్రభుత్వ కాలంతో పోలిస్తే గనుల రంగంలో 262 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించారు.
మేజర్ మినరల్స్ రంగంలో ఇప్పటివరకు 21 ఖనిజ బ్లాకులను వేలం వేసి, 11 మైనింగ్ లీజులు, 10 కాంపోజిట్ లైసెన్సులు మంజూరు చేసినట్లు తెలిపారు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, వేదాంత, హిందుస్థాన్ జింక్, అంబుజా సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, దాల్మియా సిమెంట్ వంటి ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని పేర్కొన్నారు.
ఉచిత ఇసుక విధానం అమలుతో ప్రజలకు భారీ ఉపశమనం లభించిందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 1.91 కోట్ల మెట్రిక్ టన్నులకుపైగా ఇసుకను ఉచితంగా సరఫరా చేశామని, రాష్ట్రవ్యాప్తంగా 412 ఇసుక రీచ్‌లు, 238 స్టాక్ యార్డులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ విధానం వల్ల నిర్మాణ వ్యయాలు దాదాపు 50 శాతం వరకు తగ్గాయని వివరించారు.
అక్రమ ఇసుక తవ్వకాల నియంత్రణకు ఉపగ్రహ పర్యవేక్షణ, డ్రోన్ సర్వేలు, GIS మ్యాపింగ్, GPS ట్రాకింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నామని తెలిపారు. అక్రమ తవ్వకాలపై రూ.3,500 కోట్లకు పైగా డిమాండ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
బీచ్ శాండ్ ఖనిజాల ఆధారంగా టైటానియం, రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ పరిశ్రమలను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రానికి రూ.20,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ త్వరలో వాణిజ్య ఉత్పత్తి దశలోకి ప్రవేశించనున్నట్లు తెలిపారు.
గనుల రంగంలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా శాఖ ఆదాయం 32 శాతం పెరిగిందని, 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,500 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించామని మంత్రి చెప్పారు. ఖనిజ సంపదను ప్రజల సంక్షేమానికి వినియోగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అత్యుత్తమ గనుల నిర్వహణ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.