Cyclone Arnab Update: అర్నబ్ తుపాను నేపథ్యంలో విద్యుత్ శాఖను అప్రమత్తం చేసిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనిత. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు 25 వేల స్తంభాలు సిద్ధం.

Cyclone Arnab Update: అర్నబ్ తుపాను నేపథ్యంలో విద్యుత్ శాఖను అప్రమత్తం చేసినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశాల దృష్ట్యా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు, జిల్లా అధికారులతో మంత్రులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
తుపాను సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరా నిలిచిపోతే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు. ప్రజలకు, ఆస్తులకు నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని మంత్రులు ఆదేశించారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక అప్రమత్తత పాటించాలని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
విద్యుత్ శాఖ అధికారులు ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని చెప్పారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తుపాను అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇప్పటికే 25 వేల విద్యుత్ స్తంభాలతో పాటు అవసరమైన ఇతర సామగ్రిని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు మంత్రులకు వివరించారు.
తుపాను ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాలకు అదనపు సిబ్బందిని పంపేందుకు ఎస్పీడీసీఎల్ (SPDCL) సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే మరమ్మతులు వేగంగా పూర్తిచేసి సరఫరాను పునరుద్ధరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
తుపాను, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రులు సూచించారు. కిందపడిన విద్యుత్ వైర్లు, విరిగిన విద్యుత్ స్తంభాల దగ్గరకు వెళ్లవద్దని హెచ్చరించారు. తెగిపడిన వైర్లను తాకకుండా, వాటికి దూరంగా ఉండాలని కోరారు.
విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలు ఎదురైతే వెంటనే 1912 నంబర్‌కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలు తీసుకునేలా అధికారులు సిద్ధంగా ఉండాలని మంత్రులు స్పష్టం చేశారు.