సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘హిట్ అండ్ రన్’ ధోరణితో ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయ, కుటుంబ, నైతిక విలువలు లేవని వ్యాఖ్యానించారు.

‘హిట్ అండ్ రన్’ ధోరణితో బురదజల్లుతున్నారు!
గొడ్డలి పార్టీ అధ్యక్షుడిపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు
రాజకీయ, కుటుంబ, నైతిక విలువలు లేవని వ్యాఖ్య
అమరావతి: వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బెంగళూరు నుంచి వచ్చి విలేకరుల సమావేశాల్లో ఆరోపణలు చేసి వెళ్లిపోతున్నారని, ఇది ‘హిట్ అండ్ రన్’ ధోరణి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాజకీయ ముసుగులో ఉన్న వైసీపీ నిరంతరం అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ అధ్యక్షుడికి రాజకీయ విలువలే కాకుండా కుటుంబ, నైతిక విలువలు కూడా లేవని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. 28 జిల్లాల్లో 9,829 ఎంపీటీసీ స్థానాలకు 51,902 నామినేషన్లు, 659 జడ్పీటీసీ స్థానాలకు 5,724 నామినేషన్లు వచ్చినట్లు వివరించారు. వైకాపాకు చెందిన మాజీ డిప్యూటీ స్పీకర్ ఒకరు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందని చెబుతుంటే, ఆ పార్టీ అధ్యక్షుడు మాత్రం అందుకు భిన్నంగా ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 24 శాతం స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. అప్పట్లో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి అరాచకాలకు పాల్పడి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను భయపెట్టారని, ప్రాణభయంతో ఆయన కేంద్రం నుంచి భద్రత తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియపై సొంత మీడియా కెమెరాలను కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
రాజకీయాల్లో నేరస్థులను ప్రోత్సహిస్తూ హింసకు ప్రేరేపిస్తున్నారని వైకాపాపై విమర్శలు చేశారు. కూటమి హింసకు పాల్పడదని, ఇతరులను ప్రేరేపించదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం కలగనివ్వబోమని, హింసకు ప్రతిహింస తమ విధానం కాదని చెప్పారు. అయితే, భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. నిన్న మూడు గంటలపాటు మాట్లాడిన వైకాపా అధ్యక్షుడు తన కార్యకర్తలు చేసిన తప్పులను ప్రస్తావించలేదని విమర్శించారు.
పులివెందులలో గతంలో ప్రజాస్వామ్యానికి చోటు లేకుండా ఎదురు మాట్లాడిన వారి గొంతు నొక్కేశారని చంద్రబాబు ఆరోపించారు. కూటమి పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థను చూస్తుండటంతో వైకాపా నేతల్లో అసహనం పెరుగుతోందన్నారు. కుట్రలు, కుతంత్రాలతో రక్తపాతం సృష్టించేందుకు ప్రయత్నిస్తే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రతిష్ఠ దిగజారేలా చేసే చర్యలను అంగీకరించబోమని స్పష్టం చేశారు.
రాజకీయ పార్టీల మధ్య వ్యక్తిగత కక్షలు ఉండకూడదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని చంద్రబాబు అన్నారు. అయితే, వైకాపా అధ్యక్షుడికి ప్రతి అంశమూ వ్యక్తిగత కక్షగానే కనిపిస్తోందని విమర్శించారు. ఆయన చుట్టూ సీబీఐ, ఈడీ కేసులు, అక్రమాస్తులు, మద్యం అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన వ్యవహారశైలి విధ్వంసకరంగా ఉందని వ్యాఖ్యానించారు.
కుటుంబ వ్యవహారాలపైనా ముఖ్యమంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. బాబాయి హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసేందుకు వచ్చిన సీబీఐ అధికారులను అడ్డుకున్న వ్యక్తి రాజకీయ విలువలు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. కుటుంబ ఆస్తుల విషయంలో సొంత తల్లి, చెల్లెలికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మేనకోడలి వివాహానికి యలహంక ప్యాలెస్ ఇవ్వనని చెప్పడం, ఆస్తిలో చెల్లెలికి ఉన్న హక్కును విస్మరించడం ఏమిటని ప్రశ్నించారు. మేనకోడలి పెళ్లికి అడ్డంకులు సృష్టిస్తూ కంస మామలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఎస్ఐపీబీ సహా పలు అంశాలపై సమీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత కక్షలకే ప్రాధాన్యం ఇస్తున్న నాయకుడి వ్యవహారశైలి రాష్ట్రానికి ఎంత ప్రమాదకరమో ప్రజలు గుర్తించాలని వ్యాఖ్యానించారు.
1 రోజుల క్రితం
