నంద్యాల పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వందలాది రైతులకు ఊరట కలిగించారు. వేలాది ఎకరాలను 22-ఏ నుంచి విముక్తి కలిగించారు. అలాగే మరో 100 ఎకరాలను చుక్కల భూమి జాబితా నుంచి తప్పించారు.

బనగానపల్లె: నంద్యాల పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వందలాది రైతులకు ఊరట కలిగించారు. వేలాది ఎకరాలను 22-ఏ నుంచి విముక్తి కలిగించారు. అలాగే మరో 100 ఎకరాలను చుక్కల భూమి జాబితా నుంచి తప్పించారు. మూడు నెలల క్రితం తన దృష్టికి వచ్చిన సమస్యను పరిష్కరించాలని గతంలోనే అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు.. రాష్ట్ర స్థాయిలో చేపట్టాల్సిన చర్యలను చేపట్టారు. నంద్యాల పర్యటనలో భాగంగా జిల్లా స్థాయిలో చేపట్టాల్సిన ప్రక్రియను దగ్గరుండి చేయించి.. చిక్కుల్లో ఉన్న భూములకు విముక్తి కల్పించి... రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. సీఎం చంద్రబాబు గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు. ఈ పర్యటన సందర్భంగా మూడు నెలల క్రితం డోన్ పర్యటనలో తనను కలిసిన బేతంచర్ల మండలం గుటుపల్లి గ్రామ రైతులను బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఈ ఏడాది మార్చి 9వ తేదీన డోన్ పర్యటన సందర్భంగా గుటుపల్లి రైతులు సీఎం చంద్రబాబును కలిసి తమకు చెందిన భూములను 22-ఏ జాబితాలో కలిపారని... వాటికి విముక్తి కల్పించాలని కోరారు. మూడు నెలల క్రితం తాను స్వీకరించిన అర్జీని పరిశీలించి పరిష్కరించమని ఆదేశించానని.. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో చేపట్టాల్సిన చర్యలను చేపట్టామని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన బేతంచర్ల రైతులతో ముఖ్యమంత్రి చెప్పారు. సదురు భూములను 22-ఏ జాబితా నుంచి తొలగించే ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని ముఖ్యమంత్రి జిల్లా రిజిస్ట్రార్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ నుంచి తనకు అధికారిక తొలగింపు ఉత్తర్వులు ఇంకా అందకపోవడంతో ఆన్లైన్ తొలగింపు ప్రక్రియ ప్రారంభం కాలేదని జిల్లా రిజిస్ట్రార్ వివరించారు. దీంతో ముఖ్యమంత్రి సమక్షంలో జిల్లా కలెక్టర్ తొలగింపు ఉత్తర్వులను జిల్లా రిజిస్ట్రార్‌కు అందజేశారు... వాటిని స్వీకరించిన జిల్లా రిజిస్ట్రార్ త్వరలోనే ప్రక్రియను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి చెప్పారు. త్వరలో కాదు ఇప్పుడే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రావడంతో అక్కడిక్కడే జిల్లా రిజిస్ట్రార్ సంబంధిత భూములను 22ఏ నుంచి తొలగించారు. దీంతోపాటు.. మరో అర్జీని క్లియర్ చేశారు. బనగానపల్లెకు చెందిన 101 ఎకరాలను కూడా చుక్కల భూమి జాబితా నుంచి జిల్లా రిజిస్ట్రార్ తప్పించారు. ఈ భూములకు విముక్తి కలగడంతో బేతంచర్ల మండలం గుటుపల్లి గ్రామానికి చెందిన 897 మంది రైతులకు ఊరట లభించింది. ఈ రైతులకు చెందిన 2,074 ఎకరాలు 22-ఏ నుంచి విముక్తి పొందాయి. అలాగే బనగానపల్లెకు చెందిన 23 మంది రైతుల 101 ఎకరాల చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి బయటపడ్డాయి. ఈ మేరకు సదురు భూములను 22-ఏ నుంచి విముక్తి కల్పించామన్న ఉత్తర్వులను ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు అందించారు. తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన వ్యవసాయ భూముల్ని వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా 22ఏ జాబితాలో చేర్చడంతో వ్యవసాయ రుణాలు పొందలేక, రిజిస్ట్రేషన్లు చేయించుకోలేక, ఇతర భూ లావాదేవీలు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని రైతులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. తమ సమస్య ఇంత త్వరగా పరిష్కారం అవుతుందని తాము ఊహించలేదని... అది స్వయంగా ముఖ్యమంత్రి ఈ తరహలో చొరవ చూపుతారని తాము ఊహించ లేదని రైతులు చెప్పారు. తమ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఈ సందర్భంగా రైతులకు సీఎం చంద్రబాబు వివరించారు.
దశాబ్దాల తరబడి పెండింగులో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం
బేతంచర్ల భూముల తరహాలోనే రాష్ట్రంలో మరిన్ని భూ వివాదాలకు కూటమి ప్రభుత్వం చెక్ పెడుతోంది. ఇప్పటికే తిరుపతి జిల్లా శెట్టిపల్లి, గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు, చిత్తూరు జిల్లా కంగుంది గ్రామాల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపింది. ఇప్పుడు బేతంచర్ల మండలం గుటుపల్లి రైతులకు కూడా అదే తరహాలో ప్రభుత్వం న్యాయం చేసింది. రీ సర్వే పేరుతో భూములను గత ప్రభుత్వం 22-ఏలో చేర్చి రైతులకు తెచ్చిపెట్టిన ఇబ్బందులను ప్రజాప్రభుత్వం తొలగిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటోన్న నిర్ణయాలతో 22ఏ నుంచి లక్షలాది ఎకరాలకు విముక్తి కలిగి... వేలాదిమంది రైతుల కళ్లలో సంతోషాన్ని నింపుతోంది. 2019-24 మధ్యనున్న ప్రభుత్వం చేసిన నిర్వాకంతో భూమి తమ పేరుమీదే ఉన్నా దానిని అమ్ముకోలేక, అవసరమైన సమయంలో రుణాలు పొందలేక రైతులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఇలా ఉన్న సమస్యల్లో అత్యధిక శాతం గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా ఉత్పన్నమైనవే. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రెవెన్యూ ప్రక్షాళన మీద దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం.. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ తప్పిదాలను సరి చేస్తూ పట్టాదార్ పాస్ పుస్తకాలను కొత్తవి ముద్రించి ఇవ్వడంతోపాటు... సుదీర్ఘ కాలం పెండింగులో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తోంది. అన్ని రకాల పరిశీలనలు జరిపించి నిషేధిత 22-ఏ జాబితాలో చిక్కుకున్న భూముల్ని విముక్తి చేస్తూ ప్రభుత్వం రైతులకు ప్రయోజనం కల్పిస్తోంది.