ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకం ఏడాది పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు 87 కోట్ల ప్రయాణాలు జరగగా, రోజుకు సగటున 24 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మహిళల ఆర్థిక సాధికారతకు ఉద్దేశించిన ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏడాది పూర్తి చేసుకుంది. 2025 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు 87 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. మహిళల ప్రయాణానికి ప్రభుత్వం రోజుకు సుమారు రూ.8.53 కోట్ల సబ్సిడీ అందిస్తోంది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.3,095 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ వంటి ఐదు కేటగిరీల బస్సుల్లో ‘స్త్రీ శక్తి’ పథకం అమలవుతోంది.
రాష్ట్రంలోని మొత్తం 9,978 ఆర్టీసీ బస్సుల్లో 7,631 బస్సులు, అంటే 76 శాతం బస్సులు ఈ పథకం పరిధిలో ఉన్నాయి. ఆలయాలకు నడిచే ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.
పథకం ప్రారంభానికి ముందు ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల వాటా 40 శాతం ఉండగా, ప్రస్తుతం 62 శాతానికి పెరిగింది. రోజువారీ మహిళా ప్రయాణికుల సంఖ్య 9.47 లక్షల నుంచి 24 లక్షలకు చేరుకుంది. పథకం అమలవుతున్న బస్సుల్లో ఆక్యుపెన్సీ 93 శాతానికి చేరినట్లు అధికారులు తెలిపారు.
ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు ప్రయాణ ఖర్చు తగ్గడమే కాకుండా విద్య, ఉపాధి, వైద్యం, చిన్న వ్యాపారాలు, ఇతర అవసరాలకు ప్రయోజనం కలుగుతోందని ప్రభుత్వం తెలిపింది.
కాలేజీలకు వెళ్లే విద్యార్థినులు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చిన్న వ్యాపారాల కోసం వెళ్లే మహిళలు, ఆలయాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ పథకాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు.
ఆధార్ కార్డు చూపించి రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం కల్పించారు.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు నాలుగు కేటగిరీల బస్సుల్లో అమలవుతుండగా, ఏపీలో ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
‘స్త్రీ శక్తి’ పథకం అమలైన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. చాలామంది షేర్ ఆటోలు, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ఆర్టీసీ బస్సులను ఆశ్రయించడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
‘స్త్రీ శక్తి’ పథకం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
“స్త్రీ శక్తికి సంవత్సరం.. రెట్టింపైన ఆత్మగౌరవం” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల అనంతరం రాజధాని పరేడ్ గ్రౌండ్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు ‘స్త్రీ శక్తి’ లబ్ధిదారులతో కలిసి చంద్రబాబు బస్సులో ప్రయాణించనున్నారు.
అనంతరం క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి హై-టీ కార్యక్రమంలో పాల్గొని, పథకం అమలు తీరుపై వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. పథకం ద్వారా వారికి కలుగుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై మహిళలతో సీఎం నేరుగా మాట్లాడనున్నారు.