స్విమ్స్‌లో 303 పోస్టుల భర్తీలో భారీ అక్రమాలు జరిగాయని మాజీ టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

తిరుపతి: టిటిడి పరిధిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో చేపట్టిన 303 పోస్టుల నియామక ప్రక్రియ డీఎస్సీ స్కాంను మించిన అవినీతి వ్యవహారంగా మారిందని టిటిడి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. నియామకాల పేరుతో నిబంధనలను ఉల్లంఘించి కొందరికి అనుకూలంగా మొత్తం ప్రక్రియను మార్చేశారని విమర్శించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్విమ్స్‌లో నర్సింగ్, బ్యాక్లాగ్, రెగ్యులర్, పారామెడికల్ పోస్టుల భర్తీలో విద్యార్హతలు, అనుభవం వంటి నిబంధనలను పక్కన పెట్టారని ఆయన ఆరోపించారు. పారదర్శకంగా జరగాల్సిన నియామక ప్రక్రియను కొందరు వ్యక్తులకు అనుకూలంగా మార్చి నిబంధనలకు తూట్లు పొడిచారని అన్నారు.
ఈ నియామకాల వెనుక చంద్రబాబు సమీప బంధువు ఆదిశేషయ్య కీలక పాత్ర పోషించారని భూమన ఆరోపించారు. స్విమ్స్ డైరెక్టర్‌ను పక్కనపెట్టి బర్డ్ డైరెక్టర్‌కు బాధ్యతలు అప్పగించడం, ఆదిశేషయ్యను శాఖాధిపతిగా నియమించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. గతంలో 100 మంది వైద్యుల నియామకాల్లోనూ కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, అందులోనూ ఆదిశేషయ్య పాత్ర ఉందని ఆరోపించారు.
ఉద్యోగాలు పొందే అభ్యర్థులకు అనుకూలంగా ప్రశ్నపత్రాలను రూపొందించారని, టిటిడి బోర్డు లేదా ప్రభుత్వ అనుమతి లేకుండానే నియామక నిబంధనల్లో మార్పులు చేశారని విమర్శించారు. వైద్య నియామకాలను ఏపీపీఎస్సీ, ఎయిమ్స్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వంటి నిపుణుల సంస్థల పర్యవేక్షణలో నిర్వహించాలని, సాంకేతిక పోస్టులకు ఐఐటీ వంటి జాతీయ స్థాయి సంస్థల ద్వారా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. 60 పోస్టులకు 34 వేల మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ కేవలం 18 వేల మందికే పరీక్ష రాసే అవకాశం కల్పించారని, ఒక్కో పోస్టును రూ.30 లక్షలకు విక్రయించారనే ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. 2023 నోటిఫికేషన్ ఆధారంగా 2024, 2025 అభ్యర్థులకు అన్యాయం చేశారని కూడా పేర్కొన్నారు.
700 వేదపారాయణ పోస్టుల భర్తీలోనూ ఒక్కో పోస్టును రూ.15 లక్షలకు విక్రయించారనే ఆరోపణలు వస్తున్నాయని, ఇప్పటికీ ఫలితాలు ప్రకటించలేదని భూమన అన్నారు. టిటిడిలో ఉద్యోగాన్ని సేవగా భావించే సంప్రదాయాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని, ఆరోపణలపై మౌనం అనుమానాలను మరింత పెంచుతోందని వ్యాఖ్యానించారు.
స్విమ్స్, టిటిడి నియామకాలపై వచ్చిన అన్ని ఆరోపణలపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు.