యర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జి గుడూరి ఎరిక్షన్ బాబు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. గతం ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన ఎస్సీ కోటాలో తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. త్వరలోనే తన కోరికను అధిష్టానం ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది.

త్వరలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ నేపథ్యంలో యర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జి గుడూరి ఎరిక్షన్ బాబు తన ప్రయత్నాలను వేగవంతం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎస్సీ కోటాలో తనకు అవకాశం కల్పించాలని ఆయన అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎరిక్షన్ బాబు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారు. నిత్యం స్థానిక ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాదిగ సామాజికవర్గం గణనీయంగా ఉండగా, జిల్లాలోని మూడు ఎస్సీ రిజర్వు అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతం రెండింటికి మాల సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో ఒకరు మంత్రి స్వామి కాగా, రెండోది విజయ్ కుమార్. ఈ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యం కల్పించే దిశగా ఈసారి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలని ఎరిక్షన్ బాబు వర్గీయులు కోరుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న ఎరిక్షన్ బాబుకు ఆ అవకాశం దక్కలేదు. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవిపైనే ఆయన ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు ద్వారా ఎరిక్షన్ బాబు తన పేరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. త్వరలో భర్తీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానాన్ని ఎస్సీ వర్గానికి కేటాయించే అంశాన్ని పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఎస్సీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని ఎరిక్షన్ బాబు విజ్ఞప్తి చేస్తున్నారని సమాచారం.
30 June 2026
