ప్రాజెక్టులకు భూములిచ్చి సహకరిస్తున్న రైతులు, నిర్వాసితులు ఆనందంగా ఉండేలా చూడడం ప్రభుత్వాల బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.

మార్కాపురం: ప్రాజెక్టులకు భూములిచ్చి సహకరిస్తున్న రైతులు, నిర్వాసితులు ఆనందంగా ఉండేలా చూడడం ప్రభుత్వాల బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తాము పాలన చేపడుతున్నామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని.. అలాగే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని.. ఇందుకు తనది గ్యారెంటీ ఆంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా రైతులు, నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి 2,351 మంది నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిమిత్తం రూ.300 కోట్ల విలువైన చెక్కును ముఖ్యమంత్రి అందించారు. ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. వెలిగొండ ప్రాజెక్టు చరిత్ర... మార్కాపురం జిల్లా అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...”ప్రాజెక్టుకు భూములివ్వడం అంటే త్యాగం చేసినట్టే. పూర్వీకుల నుంచి వచ్చిన భూములను ప్రాజెక్టు కోసం వదులుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టు నాలుగు జిల్లాల తలరాతను మారుస్తుంది. ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్యలు ఉన్నాయి.. దీంతో ఇక్కడి స్థానికులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మార్కాపురం ప్రాంతం అంటే కరవు ప్రాంతమని పేరు... ఈ ప్రాంతానికి కృష్ణా నీళ్లు వస్తాయని ఎవ్వరూ అనుకోలేదు. మార్కాపురం ప్రాంతానికి కృష్ణా నీళ్లిచ్చేందుకు ఎన్టీఆర్ 1985లోనే ఆలోచన చేశారు... దీని కోసం ఓ కమిటీని వేశారు. ఎన్టీఆర్ హయాంలోనే వెలిగొండ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 1995లో ప్రకాశం జిల్లా పర్యటనకు ఎప్పుడు వచ్చినా వెలిగొండ ప్రాజెక్టు గురించే అడిగేవాళ్లు. వరద వస్తే.. ఆ జలాలను మళ్లిస్తే ఆ నీళ్లతో తాము జీవనం సాగిస్తామని ఇక్కడి రైతులు చెప్పేవారు. 1996లో వెలిగొండకు శంకుస్థాపన చేశాం. వెలిగొండ ప్రాజెక్టుకు ప్రస్తుత లెక్కల ప్రకారం రూ.10,580 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు రూ.6,736 కోట్లు ఖర్చు చేశాం... ఇంకా రూ.3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. రూ.1,932 కోట్లు తొలి విడతలో ఖర్చు పెట్టాలి... రూ.1906 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. 2024లో ప్రభుత్వం వచ్చాక రూ.759 కోట్లు ఖర్చు చేశాం... నిర్వాసితుల కోసం రూ.905 కోట్లు మంజూరు చేసి రూ.300 కోట్లు విడుదల చేశాం. ప్రస్తుతం బ్యాంకులకు శెలవులు ఉన్నందున మరో రెండు రోజుల్లో నిర్వాసితుల ఖాతాల్లో ఆర్ అండ్ ఆర్ డబ్బులు జమ అవుతాయి. ఆర్థికంగా ఇబ్బందులున్నాయి... అయినా వెలిగొండ సహా వివిధ ప్రాజెక్టులను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేస్తున్నాం.”అని ముఖ్యమంత్రి చెప్పారు.
వెలిగొండతో నాలుగు జిల్లా తలరాతలు మారతాయి...
“ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన రైతులు, నిర్వాసితుల జీవితాలు మెరుగ్గా ఉంటాయి. 2,351 మంది నిర్వాసితులకు రూ.300 కోట్లు జమ చేస్తున్నాం. కలనూతల, సుంకేశుల, చింతలముడిపి, బుడుంచెర్ల, కాటంరాజు తండా, సాయిరాం నగర్, మెట్టి గొంది, బసవాయిపల్లి, లక్ష్మీపురం, అక్కచెరువు, గొట్టిపాడు గ్రామాల నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ నిధులు ఇస్తున్నాం. కొత్తగా నిర్మించబోయే కలెక్టరేట్ పక్కన కొన్ని గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నాం. కొత్త జిల్లా ఏర్పాటు చేయడంతోపాటు.. నిర్వాసితుల కాలనీలో కలెక్టరేట్ ఏర్పాటు చేస్తున్నాం... నిర్వాసితుల కాలనీల్లో మౌళిక సదుపాయాలు పూర్తి చేశాం. నిర్వాసితుల త్యాగం వల్ల 4.47 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయి. 23 లక్షల మందికి తాగునీరు లభిస్తాయి. వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ద్వారా ఈ సీజన్ లో నీళ్లను అందిస్తాం. ఫేజ్-1 కింద 1.19 లక్షల ఎకరాలకు నీళ్లు, 4 లక్షల మందికి తాగునీరు అందిస్తాం. ఫేజ్-2 కింద 3.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 11.25 లక్షల మందికి తాగునీరు అందుతుంది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం ఓ చరిత్ర. ఈ ప్రాజెక్టు లబ్దిదారులతోపాటు.. నిర్వాసితులు కూడా ఆనందంగా ఉండేలా చూడడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. హైదరాబాద్ నగరంలో తెచ్చిన ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులు కోట్లాది రూపాయలు గడించారు. అభివృద్ధి చేస్తేనే ఆదాయం వస్తుంది.. వెలిగొండ ప్రాజెక్టు వల్ల నాలుగు జిల్లాల పరిధిలో భూముల ధరలు పెరుగుతాయి... ఆ జిల్లాల తలరాతలు మారతాయి. కరవు జిల్లా పరిస్థితులను అర్థం చేసుకునే కలెక్టరును మార్కాపురానికి నియమించాం. మార్కాపురం జిల్లాలో హార్టికల్చర్ పంటలు వేయాలి. పూర్వోదయ ప్రాజెక్టులో మార్కాపురం జిల్లాను కూడా చేర్చాం. అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతుంది.. యువతకు ఉపాధి కల్పిస్తాం. రామాయపట్నం పోర్టు మార్కాపురానికి సమీపంలో ఉంది.. ఎగుమతులకు అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి కనెక్టివిటీ పెంచుతాం. మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు వద్దే ఉంటున్నారు. టన్నెల్లోకి వెళ్తున్నారు.. పుట్టిన రోజు కూడా ఇక్కడే జరుపుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు పట్టుదలతో పని చేస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి ఫేజ్ 2 కూడా పూర్తి చేస్తాం. తుంగభద్ర డ్యాంకు గేట్లు పెట్టేందుకు సహకరించాం... సీజన్ కాపాడాం. ముగ్గురు సీఎంలు, కేంద్ర మంత్రి కలిసి కొత్త గేట్లను ప్రారంభించాం. జల వివాదాలకు స్వస్తి పలకాలని నిర్ణయించాం... గంగా-కావేరి నదుల అనుసంధానం జరగాలి. పోలవరం ప్రాజెక్టులు పూర్తి అయితే.. గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార, పెన్నా, కావేరి నదులు అనుసంధానం అయ్యేందుకు అవకాశం ఉంది. నదుల అనుసంధానంతో పాటు భూగర్భ జలాలు పెంచాలి.. అందుకే జలధార కార్యక్రమం చేపట్టాం. భూగర్భ జలాలు పెరిగితే.. విద్యుత్ భారం తగ్గుతుంది.”అని ముఖ్యమంత్రి చెప్పారు.
గొడ్డలి పార్టీకి ప్రజలే బుద్ది చెప్పాలి
“గత పాలకుల నిర్వాకం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి... రాష్ట్రం విధ్వంసమైంది. శాంతి భద్రతలకు తీవ్రమైన విఘాతం కలిగించేలా వ్యవస్థలను నిర్వర్యం చేశారు. పరిశ్రమలను తరిమేశారు.. పెట్టుబడులు రాకుండా అడ్డుకున్నారు... అప్పుల భారాన్ని పెంచారు. గడచిన ప్రభుత్వం వెలిగొండ పనులు చేపట్టి ఉంటే నీళ్లు ఎప్పుడో వచ్చేవి. కూటమి ప్రభుత్వం వచ్చాకే పెద్ద ఎత్తున పనులు చేపట్టాం. గత పాలకులు వెలిగొండ ప్రాజెక్టు విషయంలో డ్రామాలాడారు.. మోసం చేశారు. మోసం చేయడంలో గొడ్డలి పార్టీ దిట్ట.. కళ్లార్పకుండా అబద్దాలు చెబుతారు... తేరుకునేలోపే మోసం చేసేస్తారు. మోసాలు ఎలా చేస్తారో.. ప్రజలను ఏ విధంగా ఏమారుస్తారోననే విషయంపై అవగాహన కల్పించేందుకు గొడ్డలి పార్టీ చర్యలను వివరిస్తూ మ్యూజియంలో పెట్టాలి. గొడ్డలి పార్టీకి బుద్ది చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది. వెలిగొండ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం కేవలం రూ.980 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. కూటమి ప్రభుత్వం నిర్వాసితులకే రూ. 900 కోట్లు ఖర్చు పెడుతోంది... నిర్మాణానికి రూ. 3 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. నిర్వాసితులకు గత ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు.. సొరంగాల్లో తవ్విన మట్టిని కూడా తీయలేదు.. ఫీడర్ కెనాల్ పనులను చేపట్టలేదు. ఇరుక్కుపోయిన టన్నెల్ బోరింగ్ యంత్రాన్ని తీయకుండానే జాతికి అంకితం అని మోసం చేశారు. 2014-19 మధ్య కాలంలోనే సొరంగాల పనులు చాలా వరకు పూర్తి చేశాం. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో 7,225 మంది నిర్వాసితులు ఉన్నారు... ప్రతి ఒక్కరి వెనుకా ఓ విషాద గాధ ఉంటుంది. పుట్టిన ఊరు నుంచి వెళ్లిపోవాలంటే చాలా బాధేస్తుంది. ఇంత మంది నిర్వాసితులుంటే... గత ప్రభుత్వం కేవలం 96 మందికి మాత్రమే పునరావాసం ఇచ్చింది. నిర్వాసితుల గోడు వెళ్లబోసుకోవాలని వస్తే కేసులు పెట్టించారు. కానీ మాది ప్రజా ప్రభుత్వం.. ఏ ఒక్కరూ నష్టపోకుండా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం.. ఇది నా గ్యారెంటీ. గత ప్రభుత్వం వదిలి పెట్టిన రూ.140 కోట్ల పెండింగ్ బిల్లులను కూడా చెల్లించాం. ఏ పార్టీ అధికారంలోకి వస్తే మాకేం అవుతుందనే భావనతో ఉండొద్దు.. ప్రజల జీవితాలను విధ్వంసం చేయవచ్చని గత పాలకులు నిరూపించారు. పోలవరం ప్రాజెక్టులో డయా ఫ్రం వాల్ పడగొట్టేలా చేశారు. ప్రభుత్వాన్ని నమ్మి అమరావతికి రైతులు భూములిస్తే.. దాన్ని నిర్వీర్యం చేశారు... రాజధాని లేకుండా చేశారు... మూడు ముక్కలాట ఆడారు. అమరావతిని రాజధానిగా కేంద్రం చట్టం చేస్తే... మావిగన్ అంటున్నారు. రాజధానితో మాకేం పని ఇతర ప్రాంతాల వాళ్లు అనుకోవద్దు... రాజధాని లేని రాష్ట్రంగా ఉండడం మంచిదా అని ప్రజలు ఆలోచించాలి. కులం, మతం, ప్రాంతం వంటి వాటి ప్రలోభాలకు గురి కావద్దు... మంచి, చెడు ఆలోచించి విశ్లేషించుకుని ఓట్లేయాలి. మార్కాపురాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది... సహకరించే బాధ్యత ప్రజలది. నన్ను చూడండి.. పార్టీని చూడండి.. ఎన్డీఏను చూసి సహకరించండి. ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తాం.. మీ నుంచి సహకారాన్ని కోరుతున్నాం.”అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీనివాసులు రెడ్డి సహా జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, నేతలు పాల్గొన్నారు.