పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులపై వైసీపీ విమర్శలకు ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో భారీగా నిధులు ఖర్చు చేశామని తెలిపారు.

మంగళగిరి: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. పోలవరం, వెలిగొండ సహా సాగునీటి ప్రాజెక్టులపై వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడే నైతిక అర్హత లేదని విమర్శించారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రతిసారీ రాష్ట్రంలో సాగునీటి రంగానికి కొత్త ఊపిరి వస్తుందని అన్నారు. నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి పరుగులు పెట్టించే సామర్థ్యం, సంకల్పం చంద్రబాబుకే ఉందని పేర్కొన్నారు.
రాయలసీమకు అదనపు జలాలు తీసుకురావాలన్న నందమూరి తారక రామారావు ఆశయాలను చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.
రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల సాగునీటి, తాగునీటి అవసరాలను తీర్చే హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కాలవ శ్రీనివాసులు తెలిపారు.
2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలోనే దాదాపు రూ.8,000 కోట్లు ఖర్చు చేసి పనులను వేగవంతం చేశామని చెప్పారు.
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.12,484 కోట్లు ఖర్చు చేశామని, అనంతరం వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ.2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆరోపించారు.
రాయలసీమను సస్యశ్యామలం చేసి కరువును శాశ్వతంగా తరిమికొట్టేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుత మార్కాపురం ప్రాంత ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా జలాలను అందించిన ఘనత చంద్రబాబు నాయుడిదేనని కాలవ శ్రీనివాసులు అన్నారు.
1996లో వెలిగొండ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన చంద్రబాబు.. 2026లో అదే ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను విడుదల చేశారని గుర్తుచేశారు.
చంద్రబాబు ప్రభుత్వాల హయాంలో వెలిగొండకు మొత్తం రూ.5,233 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇందులో 1996-2004 మధ్య రూ.430 కోట్లు, 2014-19 మధ్య రూ.1,814 కోట్లు, 2024 నుంచి ఇప్పటి వరకు రూ.2,989 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
దీనికి భిన్నంగా వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రూ.1,126 కోట్లు, జగన్ ఐదేళ్ల పాలనలో కేవలం రూ.841 కోట్లు ఖర్చు చేశారని ఆయన పేర్కొన్నారు.
“రూ.5,233 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టును పరుగులు పెట్టించిన చంద్రబాబు గొప్పా? లేక ఐదేళ్లలో కేవలం రూ.841 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి కాకుండానే ఏదో సాధించినట్లు చెప్పుకున్న జగన్ గొప్పా?” అని కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎక్కడ మంచి జరిగినా దానిని తమ ఖాతాలో వేసుకోవడం వైఎస్సార్సీపీకి అలవాటైందని కాలవ శ్రీనివాసులు విమర్శించారు.
చంద్రబాబు కష్టపడి పూర్తి చేస్తున్న ప్రాజెక్టులకు వైఎస్సార్సీపీ నేతలు క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్ల జగన్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా, వాటిని వివాదాస్పదంగా మార్చారని మండిపడ్డారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో జగన్ చేసిన రాజకీయాల వల్ల రాయలసీమకు ఒక్క పైసా ప్రయోజనం కలగలేదని ఆరోపించారు.
కర్నూలు పశ్చిమ ప్రాంతాలు, అనంతపురం వంటి తీవ్ర కరవు ప్రాంతాలకు నీరు అందలేదని అన్నారు. కృష్ణా జలాల విషయంలో అనవసర వివాదాలు సృష్టించి తెలంగాణ ప్రజల్లో రాయలసీమపై వ్యతిరేక భావన పెంచారని విమర్శించారు.
2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా కృష్ణా జలాల విషయంలో సమర్థవంతంగా వ్యవహరించారని కాలవ శ్రీనివాసులు తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో నవ్యాంధ్రకు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించేలా సాధించామని పేర్కొన్నారు.
నీటిమట్టం 800 అడుగులకు పడిపోయినా నీటిని ఎత్తిపోసేలా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి రాయలసీమకు నీటిని అందించిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు.
రాష్ట్ర జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వాలే అత్యధికంగా ఖర్చు చేశాయని కాలవ శ్రీనివాసులు తెలిపారు.
2014-19 మధ్య చంద్రబాబు హయాంలో రూ.11,178 కోట్లు, 2024-26 మధ్య కూటమి ప్రభుత్వంలో రూ.8,322 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వాల హయాంలో పోలవరంపై మొత్తం రూ.19,500 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వివరించారు.
అదే సమయంలో వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రూ.2,239 కోట్లు, జగన్ ఐదేళ్ల పాలనలో కేవలం రూ.792 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. తండ్రీకొడుకుల ఇద్దరి హయాంలో కలిపి పోలవరంపై ఖర్చు చేసింది రూ.3,021 కోట్లు మాత్రమేనని ఆరోపించారు.
పోలవరం పనుల్లో జాప్యానికి గత ప్రభుత్వాల నిర్ణయాలే కారణమని కాలవ శ్రీనివాసులు ఆరోపించారు.
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం హెడ్‌వర్క్స్ పనులు చేపట్టిన మధుకాన్ సంస్థను తొలగించడం వల్ల ప్రాజెక్టు పనుల్లో జాప్యం ప్రారంభమైందని అన్నారు.
తర్వాత జగన్ ప్రభుత్వం నవయుగ సంస్థను తప్పించి రివర్స్ టెండరింగ్ పేరుతో కొత్త కాంట్రాక్టర్‌ను నియమించడంలో జాప్యం చేసిందని ఆరోపించారు. ఈ నిర్ణయాల వల్ల పోలవరం పనులు వెనుకబడిపోయాయని విమర్శించారు.
చంద్రబాబు ప్రభుత్వాలు ప్రాజెక్టుపై భారీగా నిధులు వెచ్చించి పనులను వేగవంతం చేస్తుంటే, వైఎస్సార్సీపీ నేతలు క్రెడిట్ కోసం రాజకీయ విమర్శలు చేస్తున్నారని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.3,800 కోట్లు ఖర్చు చేసి హంద్రీ-నీవా కాలువ తొలి దశ విస్తరణ పనులను పూర్తి చేశామని కాలవ శ్రీనివాసులు తెలిపారు.
రెండో దశ పనులను కూడా దాదాపు పూర్తి చేసి, చివరి ప్రాంతమైన కుప్పం వరకు నీటిని తరలించామని పేర్కొన్నారు.
పోలవరాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన పనులను కొనసాగిస్తున్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని కాలవ శ్రీనివాసులు అన్నారు.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఎవరి హయాంలో ప్రాజెక్టులు పరుగులు పెట్టాయి, ఎవరి పాలనలో నిలిచిపోయాయో ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని పేర్కొన్నారు.
రానున్న మూడేళ్లలో ప్రాధాన్యతా క్రమంలో మిగిలిన సాగునీటి ప్రాజెక్టులను కూడా వేగంగా పూర్తి చేసి రైతాంగానికి, ప్రజలకు అంకితం చేస్తామని కాలవ శ్రీనివాసులు తెలిపారు.
చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు కొనసాగుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.