అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై యువకుడు రంపంతో దాడి చేశాడు. ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రులు స్పందించారు.

రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఘటన.. మరో బాలికకూ గాయాలు
పరారవుతుండగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు
బాధితురాలి తల్లికి ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు.. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
పవన్‌కల్యాణ్, లోకేశ్, అనిత, సత్యకుమార్ దిగ్భ్రాంతి
పాఠశాల తరగతి గదిలో పదో తరగతి విద్యార్థినిపై ఓ యువకుడు రంపంతో దాడికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా రాప్తాడులో కలకలం రేపింది. శనివారం ఉదయం రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిలో ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపడగా.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో బాలికకూ గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
శనివారం ఉదయం పాఠశాలలో తరగతులు జరుగుతున్న సమయంలో ఓ యువకుడు పదో తరగతి గదిలోకి ప్రవేశించి, వెంట తెచ్చుకున్న రంపంతో ఓ విద్యార్థినిపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో బాలిక తల, ముఖం, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినిపైనా దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ ఘటనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాలికను మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాడి అనంతరం ధర్మవరం వైపు వెళ్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ధర్మవరం మండలానికి చెందిన యువకుడని, బాధిత బాలికకు సమీప బంధువని ప్రాథమిక సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే దాడికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నారు.
విద్యార్థినిపై దాడి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత బాలిక తల్లికి ఫోన్ చేసి మాట్లాడారు. అధైర్యపడవద్దని, కుమార్తెకు అవసరమైన అన్ని రకాల వైద్య సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీతతోనూ మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన ఇద్దరు విద్యార్థినులకూ మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
పాఠశాలలోకి చొరబడి విద్యార్థినిపై దాడి చేయడాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు, బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని, బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మహిళలు, బాలికల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీపడబోదని స్పష్టం చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు సంబంధించి ఎలాంటి నిర్లక్ష్యం ఉన్నా ఉపేక్షించబోమని హెచ్చరించారు.
హోంమంత్రి వంగలపూడి అనిత, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత బాలికకు వైద్య చికిత్సలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.