ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం తుపానుగా బలపడే అవకాశం. నవంబర్ 3న నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటే సూచనలు, దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాల హెచ్చరిక.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా బలపడే దిశగా కదులుతోంది. ప్రస్తుతం గంటకు 23 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న ఈ వాయుగుండం చెన్నైకి 700 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అలాగే మచిలీపట్నానికి 770 కిలోమీటర్లు, ఒంగోలుకు 810 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం.
రానున్న ఆరు గంటల్లో ఇది తుపానుగా బలపడే అవకాశం ఉంది. అనంతరం రేపటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నాయి. ఈ నెల 3న నెల్లూరు – నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మూడు రోజులపాటు అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
సముద్రంలో పరిస్థితులు అనుకూలంగా లేని నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.