మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలుంటే కోర్టును ఆశ్రయించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష సవాల్ చేశారు.

మంగళగిరి: మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని చెబుతున్న వైసీపీ నేతలకు నిజంగా ఆధారాలు ఉంటే కోర్టును ఆశ్రయించి వాటిని నిరూపించాలని సవాల్ చేశారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
గత ఐదేళ్ల పాలనలో నిరుద్యోగులు, యువతకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని శిరీష విమర్శించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా యువతకు ఇచ్చిన హామీ మేరకు మంత్రి నారా లోకేష్ 16 వేల డీఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేసి చూపించారని పేర్కొన్నారు. జగన్ ఐదేళ్లలో చేయని పనిని కూటమి ప్రభుత్వం 150 రోజుల్లో చేసి చూపించిందని అన్నారు.
భవిష్యత్తులో మరిన్ని డీఎస్సీ నోటిఫికేషన్లు ఇస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టంగా ప్రకటించారని, ఆయన గతంలో చెప్పిన మాటలను వక్రీకరించి రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. డీఎస్సీపై కల్పిత కథనాలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
డీఎస్సీ నియామక ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించామని గౌతు శిరీష తెలిపారు. ప్రతి అంశాన్ని గెజిట్‌లో పొందుపరిచి, సంబంధిత జీఓలను జారీ చేశామని చెప్పారు. నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని, ఎవరైనా ఎప్పుడైనా వివరాలను పరిశీలించవచ్చని పేర్కొన్నారు.
డీఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఐఏఎస్ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నప్పటికీ, వైసీపీ కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.
స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను కూడా శిరీష ఖండించారు. మూడు శాతం రిజర్వేషన్ కింద 431 పోస్టులు ఉండగా, సుమారు 3,600 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. రాష్ట్రస్థాయి కమిటీ నిబంధనల ప్రకారం 382 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఎవరైనా ఎప్పుడు ప్రశ్నించినా సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశంపై తమ వద్ద స్పష్టమైన వివరాలు ఉన్నాయని అన్నారు.
డీఎస్సీపై వైసీపీ నేతలకు నిజంగా ఆధారాలు ఉంటే కోర్టును ఆశ్రయించాలని గౌతు శిరీష సవాల్ చేశారు. కోర్టులే వాస్తవాలను తేలుస్తాయని అన్నారు. గతంలో కూడా కోర్టులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ జగన్ వైఖరిలో మార్పు రావడం లేదని విమర్శించారు.
మెరిట్లో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులకు కాకుండా తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఎలా వచ్చాయని కొందరు ప్రశ్నిస్తున్నారని, అయితే నియామకాలు కేవలం మార్కుల ఆధారంగా మాత్రమే జరగవని వివరించారు. కేటగిరీ, రోస్టర్, హారిజంటల్ రిజర్వేషన్‌తో పాటు మహిళలు, దివ్యాంగులు, క్రీడాకారులు, మాజీ సైనికులకు వర్తించే నిబంధనలను పరిగణనలోకి తీసుకుని నియామకాలు చేపడతారని తెలిపారు.
గత ప్రభుత్వానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తోందని శిరీష అన్నారు. వెలిగొండ, పోలవరం ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించే చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో దాన్ని పక్కదారి పట్టించేందుకే డీఎస్సీ అంశాన్ని వైసీపీ రాజకీయంగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.
గతంలో ఏపీపీఎస్సీ ద్వారా జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై వైసీపీ నేతల వద్ద ఆధారాలు ఉంటే వాటిపై సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం యువతకు అండగా నిలుస్తోందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలను, ఉద్యోగ అవకాశాలను రాష్ట్రం నుంచి దూరం చేశారని విమర్శించారు. అమర్‌రాజా సంస్థ విషయంలోనూ ఇదే జరిగిందని ఆరోపించారు. కరోనా సమయంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టారని విమర్శిస్తూ, ఇప్పుడు అదే వైసీపీ నేతలు ఉపాధ్యాయుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
ఐదేళ్ల పాలనలో యువత కోసం జగన్ రెడ్డి ఏం చేశారో చెప్పే దమ్ము ఉందా? అని గౌతు శిరీష ప్రశ్నించారు.