మెగా డీఎస్సీపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. 16,400 పోస్టుల భర్తీని ప్రశ్నించే హక్కు జగన్‌కు లేదన్నారు.

అమరావతి: మెగా డీఎస్సీపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. 16,400 మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు. ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డీఎస్సీపై మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.
మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహణ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్‌కు ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని అన్నారు. ఎంతో పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపట్టి 16,400 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.
వేలాది మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించిన అంశాన్ని పక్కనపెట్టి వైసీపీ కేవలం స్పోర్ట్స్ కోటా అంశాన్ని పట్టుకుని రాజకీయ విమర్శలు చేస్తోందని సోమిరెడ్డి ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో సుమారు 300 పోస్టులు ఉన్నాయని తెలిపారు.
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎస్ఏపీ వైస్ చైర్మన్ సహా ఉన్నతాధికారులు ఇప్పటికే రెండుసార్లు మీడియా ముందుకు వచ్చి ఆరోపణలపై స్పష్టమైన వివరణ ఇచ్చారని పేర్కొన్నారు. అయినప్పటికీ వైసీపీ తన వైఖరిని మార్చుకోకుండా రాజకీయ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
డీఎస్సీ నియామకాలు ఇక్కడితో ఆగబోవని సోమిరెడ్డి స్పష్టం చేశారు. రాబోయే డిసెంబరులో మరో డీఎస్సీ, వచ్చే ఏడాది మరో డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి బృందానికి క్రీడల్లో కాకుండా స్కాముల్లో పోటీలు నిర్వహిస్తే దేశంలోనే మొదటి స్థానం వస్తుందని సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన భారీ కుంభకోణం కేసులో కుమారుడు మొదటి ముద్దాయిగా ఉన్న చరిత్ర వైసీపీ నేతలదేనని ఆరోపించారు.
2019కు ముందు ఉపాధ్యాయ ఖాళీలపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన జగన్, తన ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా ఎందుకు భర్తీ చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.
కష్టపడి చదివి, కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే ఎనిమిదేళ్ల శ్రమతో మెరిట్ సాధించి ఉద్యోగాలు పొందిన మహిళలు ప్రస్తుతం ఆనందంగా ఉన్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు. అలాంటి అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం బాధాకరమన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 పరీక్షల వ్యవహారాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని సోమిరెడ్డి అన్నారు. ప్రైవేట్ రిసార్టుల్లో పేపర్ల మూల్యాంకనం, ఓఎంఆర్ షీట్లలో వైట్నర్ వినియోగం వంటి అంశాలతో గ్రూప్-1 వ్యవస్థపై అనుమానాలు తలెత్తాయని ఆరోపించారు.
తమ హయాంలో జరిగిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా, పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై నిందలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు.
స్పోర్ట్స్ కోటా వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్సీ కోర్టును ఆశ్రయించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, బాధిత అభ్యర్థులు నేరుగా కోర్టుకు రాకుండా తాము ఎందుకు వచ్చామన్న న్యాయస్థానం ప్రశ్నకు వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో తిరిగి గాడిలో పడుతోందని సోమిరెడ్డి అన్నారు. అమరావతిలో డేటా సెంటర్లు, క్వాంటం వ్యాలీ వంటి ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు.
ఆగిపోయిన పోలవరం లెఫ్ట్ కెనాల్, వెలిగొండ ఫేజ్-1, నల్లమలసాగర్ వంటి సాగునీటి ప్రాజెక్టులు తిరిగి వేగం పుంజుకున్నాయని తెలిపారు. గతంలో పట్టిసీమను ‘ఒట్టిసీమ’ అంటూ ఎగతాళి చేసినవారు ఇప్పుడు అదే ప్రాజెక్టు ద్వారా రైతులకు కలుగుతున్న ప్రయోజనాలను చూడలేకపోతున్నారని విమర్శించారు.
తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో సొంత పార్టీ నాయకులు, మంత్రులను కూడా కలవని జగన్ వంటి పాలకుడిని చూడలేదని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రం అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు, ప్రభుత్వం దెబ్బతినాలనే ప్రతికూల ధోరణితో వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని సోమిరెడ్డి స్పష్టం చేశారు. డీఎస్సీని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ యువతకు అండగా నిలుస్తామని తెలిపారు.