బ్యాలెట్ బాక్సుల తరలింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నల్లపాడు వద్ద రహదారిపై బైఠాయించిన వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సుల తరలింపు వ్యవహారం గుంటూరు సమీపంలో ఉద్రిక్తతకు దారితీసింది. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపిన వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నల్లపాడు వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.
వెంగళాయపాలెం నుంచి బ్యాలెట్ బాక్సులను తరలిస్తుండగా అధికారులు వాటిని మారుస్తున్నారంటూ వైకాపా శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నల్లపాడు వద్ద వాహనాన్ని అడ్డుకుని ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు ప్రధాన రహదారిపై బైఠాయించారు.
దీంతో గుంటూరు-నల్లపాడు మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అనుమతి లేకుండా రహదారిపై ఆందోళన నిర్వహించడం, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అప్పిరెడ్డిని అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాత్రంతా ఆయనను ఠాణాలోనే ఉంచినట్లు సమాచారం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.