మురసు తుపాను ప్రభావంతో కొత్తపట్నం తీరానికి కొట్టుకొచ్చిన బోటు ప్రమాదంలో ఏడుగురు తమిళ మత్స్యకారులు మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అమరావతి: మురసు తుపాను ప్రభావంతో సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రకాశం జిల్లా కొత్తపట్నం తీరానికి కొట్టుకొచ్చిన బోటులో మొత్తం తొమ్మిది మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. ప్రమాద వివరాలపై సీఎం, డిప్యూటీ సీఎం ఉన్నతాధికారులతో వేర్వేరుగా సమీక్షించారు.
గల్లంతైన ఇద్దరి ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకారుల బృందాలు సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టాలని ఇరువురు నేతలు ఆదేశించారు. మృతదేహాల గుర్తింపు, పోస్టుమార్టం ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
మృతులంతా తమిళనాడుకు చెందినవారు కావడంతో ఆ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు త్వరితగతిన తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. వాతావరణ పరిస్థితులపై మత్స్యకారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు.
2 రోజుల క్రితం
