దీపావళి ముహూరత్ ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 28.62 పాయింట్లు, నిఫ్టీ 43.95 పాయింట్లు క్షీణించాయి.

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. తొలుత లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివర్లో బ్యాంకింగ్, ఐటీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి, మదుపరుల లాభాల స్వీకరణతో నష్టాల్లోకి జారుకున్నాయి.
సెన్సెక్స్ 28.62 పాయింట్లు డౌన్
బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 81,442 పాయింట్ల గరిష్ఠాన్ని, 80,932 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. చివరకు 28.62 పాయింట్లు (0.04 శాతం) నష్టపోయి 80,999.40 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఒక దశలో 25,132 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసినప్పటికీ.. చివరికి 43.95 పాయింట్లు (0.18 శాతం) క్షీణించి 24,986.40 వద్ద ముగిసింది.
మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ జోరు
ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిసినా.. విస్తృత మార్కెట్లో కొనుగోళ్ల జోరు కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.13 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 0.94 శాతం లాభపడ్డాయి. షేర్ల వారీగా ఎస్బీఐ లైఫ్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, భారతీ ఎయిర్టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా నష్టాలను చవిచూశాయి. సన్ ఫార్మా, టాటా స్టీల్ లాభాల్లో నిలిచాయి. ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు రాణించగా.. బ్యాంక్ నిఫ్టీ, ప్రైవేట్ బ్యాంకింగ్, ఐటీ రంగాలు వెనుకబడ్డాయి.
ఎంపిక చేసిన షేర్లలోనే రాబడులు
నూతన విక్రమ సంవత్ ప్రారంభం సందర్భంగా మార్కెట్ నిపుణులు మదుపరులకు పలు సూచనలు చేశారు. రాబోయే ఏడాదిలో మార్కెట్ల నుంచి వచ్చే రాబడులు మితంగా ఉండొచ్చని, అన్ని రంగాల కంటే ఎంపిక చేసిన రంగాలు, షేర్లే మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మార్కెట్ పెరుగుదలకు కంపెనీల ఆదాయ వృద్ధి కీలకమవుతుందని పేర్కొన్నారు. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం బలమైన ఆర్థిక మూలాలు, నాణ్యమైన ఆదాయ వృద్ధి కలిగిన కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ముహూరత్ ట్రేడింగ్ ప్రత్యేకత ఇదీ!
దీపావళి సందర్భంగా లక్ష్మీపూజ సమయంలో నిర్వహించే గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌నే ముహూరత్ ట్రేడింగ్‌గా పరిగణిస్తారు. హిందూ నూతన ఆర్థిక సంవత్సరం విక్రమ సంవత్ ప్రారంభానికి ఇది సంకేతం. ఈ శుభ సమయంలో షేర్లు కొనుగోలు చేస్తే ఏడాదంతా సంపద, శ్రేయస్సు కలుగుతాయని మదుపరుల విశ్వాసం.
2 రోజుల క్రితం
