అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతీయ అమెరికన్లతో పాటు తన ప్రభుత్వంలోని ప్రముఖ అధికారులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా సహా పలువురు ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు.
శుక్రవారం జరిగిన ఈ వేడుకలను ట్రంప్ సంప్రదాయబద్ధంగా దీపం వెలిగించి ప్రారంభించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, సామాజిక భద్రతా పరిపాలనా విభాగం డిప్యూటీ కమిషనర్ అర్జున్ మోదీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా, పారిశ్రామికవేత్త విశాల్ గోండాల్, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ జయ్ భట్టాచార్య ఈ వేడుకలకు హాజరైన వారిలో ఉన్నారు.
ధల్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధ్యక్షురాలు, సీఈఓ రూబీ ధల్లా, నాక్ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ రాజీవ్ శర్మ, కేశవం డీసీ అధ్యక్షుడు విశ్వజిత్ మల్లంపాటి, అధ్యక్షుడి ప్రత్యేక ఆహ్వానితుడు హేతల్కుమార్ పటేల్ కూడా పాల్గొన్నారు. వైట్‌హౌస్ ఈవెంట్స్ విభాగానికి చెందిన అరవింద్ చద్దా సైతం వేడుకల్లో భాగమయ్యారు.
ఈ సందర్భంగా జీఓక్యూఐ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ విశాల్ గోండాల్ అధ్యక్షుడు ట్రంప్‌కు తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా ప్రతిని బహూకరించారు. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వెల్లడించారు. హనుమాన్ చాలీసా కోట్లాది మంది భక్తులకు ధైర్యం, భక్తి, శక్తిని అందించే పవిత్ర స్తోత్రమని పేర్కొన్నారు.
ఓవల్ కార్యాలయంలో దీపావళి వేడుకల్లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని గోండాల్ తెలిపారు. దీపాలు వెలిగించిన సమయంలో భారత్, అమెరికా మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడాలని, చీకటిపై వెలుగు విజయం సాధించాలని ప్రార్థించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వేడుకలకు సంబంధించిన ఫొటోలను కూడా పంచుకున్నారు.
2003లో ప్రారంభమైన సంప్రదాయం
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించే సంప్రదాయాన్ని 2003లో అప్పటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ప్రారంభించారు. తొలినాళ్లలో భారతీయ అమెరికన్ సమాజ ప్రతినిధులు, భారత దౌత్యవేత్తల సమక్షంలో ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ భవనంలో ఈ కార్యక్రమాలు జరిగేవి.
2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్ ఈస్ట్ రూమ్‌లో స్వయంగా దీపం వెలిగించి ఈ వేడుకల్లో పాల్గొన్న తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచారు. అప్పటి నుంచి వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయం, రూజ్వెల్ట్ రూమ్ సహా వివిధ ప్రాంతాల్లో దీపావళి దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.